Rammurthy naidu: అనుచరులకు అండగా నిలిచిన రామ్మూర్తి గురించి ఈ విషయాలు తెలుసా? .
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. నారావారి పల్లెలో అధికార లాంచనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఈ సందర్భంగా నారా రామ్మూర్తి జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఏపీ సీఎం చంద్రబాబు సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అస్తమయం నారావారిపల్లి లో విషాదాన్ని మిగిల్చింది. 72 నారా రామ్మూర్తి నాయుడు దాదాపు 15 ఏళ్ల అనారోగ్యంతో తుది శ్వాస విడవడంతో ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. అధికార లాంఛనాలతో నారావారిపల్లెలో ఆయన అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. సీఎం చంద్రబాబు నాయుడు రామ్మూర్తి నాయుడి పాడె మోశారు. రామ్మూర్తి నాయుడి అంత్యక్రియల్లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఇక రామ్మూర్తి నాయుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. నారావారిపల్లికి చెదర ఖర్జురనాయుడు, అమ్మన్నమ్మ ల మూడో సంతానంగా జన్మించిన రామ్మూర్తి నాయుడు డిగ్రీ చదువుకు మధ్యలో స్వస్తి చెప్పగా కోబాక గ్రామానికి చెందిన ఇందిరను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు గిరీష్ రోహిత్ ఇద్దరు కొడుకులు ఉండగా రోహిత్ హీరోగా గిరీష్ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. 1992 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నారా రామ్మూర్తి నాయుడు అప్పట్లో చంద్రబాబుకు చేదోడుగానే ఉన్నారు. 1994లో ఎన్టీఆర్ ఆశీస్సులతో చంద్రగిరి టిడిపి టికెట్ దక్కించుకున్న నారా రామ్మూర్తి నాయుడు గల్లా అరుణకుమారిపై 16 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. కార్యకర్తలకు పూర్తి సమయం అందుబాటులో ఉండే నేతగా అనుచరులకు అండగా నిలిచిన రామ్మూర్తినాయుడు అందరితోనూ సఖ్యతగా ఉండే నేతగా ఎదిగాడు.
అయితే 1999 ఎన్నికల్లో ఓటమి అనంతరం రాజకీయంగా రాణించలేకపోయారు. 1999 ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయిన రామ్మూర్తి నాయుడుకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఇక 2004 ఎన్నికల్లో టికెట్టు దక్కే పరిస్థితి లేదని తెలుసుకున్న రామ్మూర్తి నాయుడు 2003లో టిడిపిని వీడి కాంగ్రెస్ చెంత చేరాడు. రామ్మూర్తి నాయుడును కాంగ్రెస్ లో చేర్చుకున్న కాంగ్రెస్ 2004 ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ అధినేత్రి సోనియాపై తిరుగుబాటు చేశారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి పోటీలో టిడిపి కంటే ఎక్కువ ఓట్లు సాధించిన రామ్మూర్తి నాయుడు తన బలాన్ని చాటుకున్నాడు.
చంద్రగిరి ఎమ్మెల్యేగా కాణిపాకం ఆలయ మాస్టర్ ప్లాన్ కు ఆయనే మూలకర్త గా అప్పట్లో మారాడు. ఆలయ అభివృద్ధిలో కీలకపాత్ర వహించిన నారా రామ్మూర్తి నాయుడు ఆలయ విస్తరణ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. కాణిపాకం ఆలయం రాష్ట్రంలోని 6ఏ కేటగిరి ఆలయాల్లో ఒకటిగా చేర్చేందుకు కారణం అయ్యాడు. ఇలా రాజకీయంగా కొంతకాలమే ఈ రకంగా వ్యవహరించిన ఆయన మార్క్ చంద్రగిరి రాజకీయాల్లో ఉండిపోయింది. దాదాపు 15 ఏళ్ల అనారోగ్యంతో బాధపడ్డ రామ్మూర్తి నాయుడు అస్తమయం పార్టీ కేడర్ తో పాటు స్థానికులకు ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు అయ్యింది. హైదరాబాదులో అనారోగ్యంతో మృతి చెందిన నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం సొంత గ్రామం నారావారిపల్లికి చేరుకోగా సన్నిహితులు బంధువులు ఆత్మీయులు నివాళులర్పించారు అధికారిక లంచనాలతో రామ్మూర్తి నాయుడు భౌతిక కయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..