AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి నడి రోడ్డులో మాటు వేసిన ఉన్నతాధికారులు.. చూసి అవాక్కైన లారీ డ్రైవర్లు..!

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న చెక్ పోస్ట్ కావడంతో సాధారణంగానే ఎక్కువగా తనిఖీలు జరుగుతుంటాయి. అయితే అర్ధరాత్రి ఇద్దరూ వ్యక్తులు అక్కడే మాటు వేశారు. మందీ మార్బలంతో వరుసగా వస్తున్న లారీలను వారే చెక్ చేయడం ప్రారంభించారు.

అర్ధరాత్రి నడి రోడ్డులో మాటు వేసిన ఉన్నతాధికారులు.. చూసి అవాక్కైన లారీ డ్రైవర్లు..!
Palnadu District Collector And Sp
T Nagaraju
| Edited By: Balaraju Goud|

Updated on: Sep 06, 2025 | 11:49 AM

Share

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న చెక్ పోస్ట్ కావడంతో సాధారణంగానే ఎక్కువగా తనిఖీలు జరుగుతుంటాయి. అయితే అర్ధరాత్రి ఇద్దరూ వ్యక్తులు అక్కడే మాటు వేశారు. మందీ మార్బలంతో వరుసగా వస్తున్న లారీలను వారే చెక్ చేయడం ప్రారంభించారు. దీంతో అందరిలోనూ ఒకటే టెన్షన్.. ఏం జరిగింది..? ఎందుకింత హడావుడి చేస్తున్నారు అని ప్రశ్నించుకోవడం జిరిగింది.

అయితే పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు ఇద్దరూ సాధారణ దుస్తుల్లో చెక్ పోస్ట్ వద్దకు రాత్రి పదకొండు గంటల సమయంలో వచ్చారు. వచ్చిన వెంటనే లారీలను ఆపి, తనిఖీ చేయడం మొదలు పెట్టారు. దీంతో అక్కడున్న సిబ్బందితో పాటు చుట్టుపక్కల పనిచేసే ప్రభుత్వాధికారులు అప్రమత్తమయ్యారు. పదకొండు గంటలకు మొదలైన తనిఖీలు తెల్లవారుజాము వరకూ జరిగాయి. తనిఖీలు ఎందుకు చేశారని అందరూ ప్రశ్నించుకోవడం జరిగింది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో యూరియా కొరత లేదని అధికారులు చెబుతూ వచ్చారు. ఇప్పటి వరకూ పద్దెనిమి వేల నుండి ఇరవై వేల టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే కొద్దీ రోజుల క్రితం కారంపూడికి చెందిన వ్యాపారి అక్రమ పద్దతిలో యూరియా ఏపీ బోర్డర్ దాటిస్తుండగా స్థానిక పోలీసులు పట్టుకున్నారు. అప్పటి నుండి కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచె శ్రీనివాసరావు ఈ చెక్ పోస్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు.

వీడియో చూడండి.. 

తెలంగాణాలో యూరియా కొరత కారణంగా ఇక్కడి వ్యాపారులు అక్రమ పద్దతుల్లో బోర్డర్ దాటిస్తున్నట్లు అనుమానాలు వచ్చాయి. దీంతో క్షేత్ర స్థాయిలో పరిస్థితి తెలుసుకునేందుకు కలెక్టర్, ఎస్పీ నడుంబిగించారు. ఇద్దరూ అర్ధరాత్రి వేళలో చెక్ పోస్ట్ వద్దకు వచ్చి స్వయంగా తనిఖీలు చేశారు. దాచేపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న గోడౌన్లలో సోదాలు చేశారు. తెల్లవారు జాము వరకూ అక్కడే ఉన్నారు. అయితే ఎటువంటి అక్రమ రవాణా లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

అక్రమ పద్దతుల్లో యూరియా తరలిస్తే ఏకా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు హెచ్చరించారు. యూరియా కొరత ఉన్నట్లు కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అటువంటి వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. కింది స్థాయి అధికారులు కూడా యూరియా అక్రమంగా తరలించడాన్ని అడ్డుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..