అనపర్తి నియోజకవర్గంలో బీజేపీకి కేటాయించిన టికెట్ టీడీపీకి చెందిన నల్లమిల్లికి దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో బీజేపీ అభ్యర్థి, మాజీ సైనికుడు శివకృష్ణంరాజుకు కేటాయించిన టికెట్ మార్చాల్సిన అవసరమేంటనే టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఓ పక్క బీజేపీ కేంద్ర నాయకత్వం ఓ మాజీ సైనికుడికి టికెట్ కేటాయించి తన దేశభక్తిని చాటుకుంటే ఏపీ బీజేపీ నాయకత్వం మాత్రం రాజీపడుతోందనే చర్చ జరుగుతోంది.
తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటుపై మరో జగడం మొదలైంది. బీజేపీ అభ్యర్థి, మాజీ సైనికుడు శివకృష్ణంరాజుకు ఇప్పటికే టికెట్ కేటాయించినా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అనపర్తి నుంచి టీడీపీ పోటీ చేస్తే రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో బీజేపీ గెలుపు సులభతరం అవుతుందనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. దీంతో రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి పునరాలోచనలో పడ్డారు. టీడీపీ నుంచి అనపర్తి టికెట్ ఆశిస్తో్న్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రిలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో సమావేశమై చర్చలు జరిపారు. టికెట్‌పై త్వరలోనే పూర్తి స్పష్టత వస్తుందన్నారాయన. క్లారిటీ వచ్చేవరకు నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు నల్లమిల్లి. తాను ఇతర పార్టీలోకి వెళ్లే ప్రసక్తేలేదన్నారు. తాను చేపట్టిన న్యాయం కోసం కార్యక్రమానికి ప్రజల నుంచి సానుకూలమైన స్పందన వచ్చాయన్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
మరోవైపు ఓ మాజీ సైనికుడైన శివకృష్ణంరాజుకు ప్రత్యక్ష రాజకీయాల్లో స్థానం కల్పించి, అనపర్తి ఎమ్మెల్యే టికెట్ ని కేటాయించడం ద్వారా చిత్తశుద్ధిని చాటుకుంది బీజేపీ కేంద్ర నాయకత్వం. విలువలు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పార్టీ అని నిరూపించుకుంది. అయితే ఎంతో ప్రతిష్టాత్మంగా మాజీ సైనికుడికి కోసం కేటాయించిన ఈ సీటును ఏపీ బీజేపీ నాయకత్వం మార్చాలని చూడటం దేశభక్తులను, మాజీ సైనికులను విస్మయానికి గురిచేస్తోంది. అనపర్తి నుండి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తేనే రాజమండ్రిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలుస్తారని ప్రచారం జరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మాజీ సైనికులు. బీజేపీ ఇప్పటికే టికెట్ కేటాయించిన శివకృష్ణంరాజుది ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీ కుటుంబమే. ఆయన తండ్రి బీజేపీకి పని చేశారు. తన తండ్రి వైద్యం కోసం ఆర్మీకి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుని వచ్చిన శివకృష్ణంరాజు క్రమంగా జిల్లా బీజేపీలో క్రియాశీలకంగా మారారు. 4 సంవత్సరాలుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సంవత్సరకాలంగా అనపర్తి నియోజకవర్గ కన్వీనర్‌గా కొనసాగుతున్నారు.
ఇంతగా అంకితభావంతో పనిచేసిన శివకృష్ణంరాజును కాదని అనపర్తి టికెట్ టీడీపీ ఇవ్వాలనుకోవడంపై నియోజకవర్గ బీజేపీలో అసంతృప్తి నెలకొంది. మాజీ సైనికుడి సీటును మార్చడానికి ప్రయత్నం చేయటం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశముందని బీజేపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోన్న అనపర్తి టికెట్ రగడ ఎప్పటికి తేలుతుందోనని కూటమి పార్టీల కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…