టీడీపీ, జనసేన పొత్తుల ప్రకటనతో బీజేపీ నేతల్లో ఆశలు ఆవిరి!

ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవుతామనుకున్నారు. కుటుంబ పార్టీలతో రాజకీయాలు అవసరం లేదన్నారు. ఏపీలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు చేస్తామన్న ఆశలపై నీళ్లు చల్లారు. పొత్తులపై ఏపీ బీజేపీలో నడుస్తున్న చర్చ ఏంటి? పొత్తుల ప్రకటన బిజెపి నేతల్లో నిరాశ ఎందుకు వ్యక్తం అవుతుంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయింది. విభజన తర్వాత ఏపీలో నెలకొన్న రాజకీయ సమీకరణాల నడుమన బిజెపికి పట్టుమని పది సీట్లు కూడా రాలేదు.

టీడీపీ, జనసేన పొత్తుల ప్రకటనతో బీజేపీ నేతల్లో ఆశలు ఆవిరి!
AP BJP

Edited By:

Updated on: Mar 10, 2024 | 5:01 PM

ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవుదామనుకున్నారు. కుటుంబ పార్టీలతో రాజకీయాలు అవసరం లేదన్నారు. ఏపీలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు చేస్తామన్న ఆశలపై నీళ్లు చల్లారు. పొత్తులపై ఏపీ బీజేపీలో నడుస్తున్న చర్చ ఏంటి? పొత్తుల ప్రకటనతో బిజెపి నేతల్లో నిరాశ ఎందుకు వ్యక్తం అవుతుంది? రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయింది. విభజన తర్వాత ఏపీలో నెలకొన్న రాజకీయ సమీకరణాల నడుమన బిజెపికి పట్టుమని పది సీట్లు కూడా రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం మారినా.. ఏపీ బీజేపీలో మాత్రం అందుకు భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. విభజన తర్వాత తెలంగాణలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తన ఉనికిని నిలుపుకోవడంతో పాటు ఓట్లను, సీట్ల రూపంలో మెరుగైన ఫలితాలను రాబట్టుకుంది. అయితే ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురుకావడంతో ఏపీ బీజేపీలో ఆందోళన వ్యక్తం అవుతోంది. 2019 ఎన్నికల్లో బిజెపి నోటాతో పోటీ పడిందని ఏపీ బీజేపీలోను పెద్ద చర్చ నడుస్తోంది. ఏపీలో బీజేపీకి ముగ్గురు అధ్యక్షులు మారినా రెండుసార్లు ఎన్నికలు జరిగినా పరిస్థితి మారలేదని.. ఓట్లు, సీట్లు సంగతి పక్కన పెడితే ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదుగుదామని అనుకున్న ప్రతీసారి పొత్తుల రూపంలో ఎదురవుతున్న పరిణామాల దృష్ట్యా ఏపీలో బీజేపీ భవిష్యత్తు ఏంటన్న చర్చ పార్టీలో పెద్ద ఎత్తున నడుస్తోంది.

2014లో టిడిపి, బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తే నాడు నెలకొన్న రాజకీయ సమీకరణాల నడుమన బిజెపికి ఓట్లు, సీట్లు వచ్చినా పొత్తులో భాగంగా వచ్చాయంటూ విమర్శలు ఎదుర్కొంది. ఇక అనంతరం జరిగిన పరిణామాలతో 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి నోటాతో పోటీపడిన బిజెపి… ఉనికి కోసం పోరాటం చేస్తూనే ఉంది. అయితే ఏపీలో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీలకు ప్రత్యామ్నాయంగా, కుటుంబ రాజకీయాలకు వారసత్వ పార్టీలకు వ్యతిరేకంగా ఎదుగుతామంటూ పెద్ద పెద్ద ప్రకటనలు చేసిన బిజెపి ఇప్పుడు అనూహ్యంగా పొత్తులతో ఎన్నికలకు రెడీ అవ్వడం ఏపీ బీజేపీలోని ఒక వర్గం నేతలను నిరాశకు గురిచేస్తోందట. ఐదేళ్ల నుంచి అనేక అంశాల్లో అటు తెలుగుదేశాన్ని, జనసేన, వైసీపీని వ్యతిరేకించి అనూహ్యంగా ఇప్పుడు పొత్తులు పెట్టుకోవడం ఏంటని ఆ పార్టీలోని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఓట్లు, సీట్లు ప్రామాణికం కాదని పార్టీ బలోపేతం, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలి అనుకున్నప్పుడు పొత్తుల పేరుతో తీర్మానాలు చేయడం.. పదేళ్లుగా పార్టీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోవడం అందుకు ప్రధాన కారణమని బీజేపీ సీనియర్ల మధ్య చర్చ జరుగుతోంది.

పొత్తుల పంచాయితీ ఏపీ బీజేపీలో లేనంతకాలం పార్టీకి మంచి రోజులు వస్తాయని కొందరు నేతలు అంటున్నారు. మరోవైపు పొత్తులు పెట్టుకోవడం బిజెపికి కొత్త కాదు. గత మూడు దశాబ్దాలుగా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. ఇక్కడ బీజేపీ పొత్తులతో వెళ్లాలని.. జాతీయ అధినాయకత్వం తీర్మానాలు చేసి పంపిన తర్వాత.. రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిందని బిజెపిలోని కొందరు నేతలు అంటున్నారు. పొత్తులతో వెళ్లాలి అనుకున్నప్పుడు ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా కార్యాచరణ సిద్ధం చేయడం ఎందుకని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు పోటీ చేద్దామని గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలు ఆ ఆశలు అడియాశలు అయ్యాయని లోలోపల మదనపడుతున్నారట. నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా తమకు ఎంతో కొంత లాభం చేకురుతుందని పార్టీ తరపున అభ్యర్థిగా బరిలో దిగుదామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటే.. సడన్ గా ఆశలపై నీళ్లు చల్లారని ఏపీ బీజేపీ నేతలు అనుకుంటున్నారు!

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..