దేవుడి దర్శనానికొచ్చి.. ద్యావుడా అని కళ్లు తేలేసిన భక్తజనం.. కడుపు మండి వాళ్లు పెట్టిన శాపనార్థాలు.. దీంతో పుట్టిన రాజకీయ రచ్చలు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌కి చేరాయి. డ్యామేజ్ కంట్రోల్‌కి దిగిన ప్రభుత్వ యంత్రాంగం.. మళ్లీ రాజకీయ రొచ్చులోనే కాలేస్తోంది. ఎరక్కపోయి ఆరోపణలు చేసిన విపక్షాలు కూడా డిఫెన్సులో పడ్డాయి. వీటన్నిటికంటే విచిత్రమైంది ఏంటంటే ఒక స్వామీజీ రెండు వీడియోల ఎపిసోడ్. టోటల్‌గా సింహాచలం అప్పన్న చందనోత్సవం.. ఒక కమర్షియల్ చలనచిత్రాన్ని మించి.. వినోదాన్నిస్తోంది.
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం.. ఉత్తరాంధ్రలో అరుదైన వేడుక చందనోత్సవం.. ఏడాదికి ఒక్కసారే దొరికే మహాభాగ్యం..! కానీ..ఈసారి తీవ్రస్థాయిలో అభాసుపాలైంది. గందరగోళానికి దారితీసింది..
చెయ్యాల్సిన ఏర్పాట్లలో అలసత్వం వహించారని, వీఐపీల సేవలో తరించారని, సామాన్య భక్తుల్ని విస్మరించారని, ప్రోటోకాల్స్‌ని తుంగలో తొక్కేశారని, టిక్కెట్ల రేట్లలో అవకతవకలు జరిగాయని.. ఇలా బోలెడన్ని ఆరోపణలతో తడిసి ముద్దయిపోయింది అధికార యంత్రాంగం. మంత్రిని కూడా అసహనానికి గురిచేసిన అలనాటి దృశ్యం.. తెలుగునాట రచ్చ లేపింది.
సామాన్య భక్తుల రుసరుసలు సరేసరి. కానీ.. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందే కన్నెర్ర చేస్తే. దాన్నేమనాలి? కొండపైకి వెళ్లడానికే గంటన్నర పట్టింది.. గర్భాలయంలో కూడా తచ్చాడుతున్న పోలీసులు.. భారీగా జరుగుతున్న పైరవీలు.. ఇవన్నీ చూసి స్వామివారికి చిర్రెత్తుకొచ్చింది. ఆలయ ప్రాంగణంలోనే అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. దర్శనానికి ఎందుకు వచ్చానా అనిపిస్తోంది. అంటూ ఆయన ఆవేదన చెందిన తీరు.. ఆగమేఘాల మీద వైరలైంది.
ఆరునెలల నుంచి ఈవో ఎందుకు లేరన్న ప్రశ్న.. ప్రభుత్వానికి తాకిందో లేదోగాని.. స్వామీజీ ఇచ్చిన కోటింగ్ అధికారులకు మాత్రం బాగానే తగిలింది. వెంటనే అంతరాలయ దర్శనం ఆపేసి.. రద్దీ నియంత్రణకు ప్రయత్నించారు. అయితే దర్శనం తర్వాత పీఠానికి వెళ్లిన స్వరూపానంద నాలిక్కర్చుకుని.. ఇంకో వీడియో రిలీజ్ చేయడం ఆసక్తికరం.
తప్పు ప్రభుత్వానిది కాదు.. అధికారులది. ప్రభుత్వం అధికారుల్ని నియమిస్తుంది.. అధికారులు పని చేస్తారు అంటూ ఆయనిచ్చిన డెఫినిషన్.. నెట్లో ఇంకా వైరలైంది. ఏపీలో అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటున్న శారదా పీఠాధిపతి.. అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడ్డం.. ఆ తర్వాత యూటర్న్ తీసుకుని జాగ్రత్తపడ్డం.. అపోజిషన్ పార్టీల ఫాలోయర్లకు చేతి నిండా పనిదొరికినట్టైంది. ఇటు.. అప్పన్న దర్శనం విషయంలో రాజకీయంగా కూడా రూలింగ్ పార్టీ బాగా కార్నరైంది. తప్పు మాది కాదు.. భక్తులదే అంటూ బ్లేమ్ గేమొకటి.
పదిహేను వందల రూపాయలు టికెట్లు ఒక స్కామ్ అని.. ఆరు వేలు చెప్పి 20 వేల టిక్కెట్లు ముద్రించారని.. వాటి పంపకాల విషయంలో కూడా గోల్‌మాల్ జరిగిందని.. మొత్తంగా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బ తిన్నాయని, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సౌండిచ్చింది జనసేన. టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా దాదాపుగా ఇటువంటి ఆరోపణలే చేశారు. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన దర్శనాన్ని అభాసుపాలు చేశారని, ప్రభుత్వమే బాధ్యత వహించాలని గంటా డిమాండ్ చేస్తే.. రివర్స్‌లో ఆన్సరిచ్చారు దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ.
నువ్వెన్ని ప్రోటోకాల్ టికెట్లు తీసుకున్నావో చెప్పు బ్రో అంటూ వైసీపీ నుంచి వచ్చిన కౌంటర్.. గంటాను ఇరకాటంలో పడేసింది. గంటా సమాధానం చెప్పకపోతే మేమే చెప్తాం అంటూ రెచ్చగొడుతోంది అధికార పార్టీ. సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన గందరగోళంపై రాజకీయాలు ఇలా నడుస్తుండగానే… అధికారులు మాత్రం… వాట్‌టుడూ వాట్ నాట్‌టూడూ అంటూ రివ్యూ మీటింగులతో బిజీ అయ్యారు. ఫ్యూచర్‌లో రిపీట్ కాకుండా చూసుకుందాం అంటూ సిబ్బందికి వార్నింగులిచ్చుకుంటున్నారు పోలీస్ కమిషనర్ అండ్ జిల్లా కలెక్టర్. మొత్తానికి ఈసారి అప్పన్న చందనోత్సవం చిన్నపాటి చరిత్రనే సృష్టించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..