Reservations: ఎన్నికల వేళ తెరపైకి రిజర్వేషన్ల స్వరం.. ఈ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే..
సార్వత్రిక ఎన్నికలకు టైం దగ్గర పడడంతో పార్టీలన్నీ పొత్తులు, మేనిఫెస్టోలు, అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. వివిధ సంఘాలు కూడా తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని లేకపోతే తమ మద్దతు ఉండదని ప్రకటిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో కుల రాజకీయాలు కాక రేపుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికలకు టైం దగ్గర పడడంతో పార్టీలన్నీ పొత్తులు, మేనిఫెస్టోలు, అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. వివిధ సంఘాలు కూడా తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని లేకపోతే తమ మద్దతు ఉండదని ప్రకటిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో కుల రాజకీయాలు కాక రేపుతున్నాయి. పార్టీలతో పాటు సంఘాలు ఒక్కక్కటిగా తమ అస్త్రాలను బయటకు తీస్తున్నాయి. తమ డిమాండ్లు, సమస్యలపై వెంటనే స్పందించాలని పార్టీలను కోరుతున్నాయి. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని, జన గణనలో కులగణన చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ బీసీ కుల గణన, పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెడుతామని ప్రకటిస్తుందో ఆ పార్టీకే బీసీలు మద్దతిస్తారన్నారు. బీసీ ప్రధానమంత్రి ఉన్నా కూడా బీసీల పట్ల చిన్నచూపు చూస్తున్నారన్నారు. రాజ్యాంగ సవరణ చేసి విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతం పెంచాలని కోరారు. తమ డిమాండ్ల సాధన కోసం ఎంతవరకైనా పోరాడుతామని ఆయన హెచ్చరించారు.
పదే పదే ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకునే సమయం ఆసన్నమైందన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ నెల 17న ఎస్సీ వర్గీకరణ అంశం విచారణకు రానుందని.. ఈ లోపే రాష్ట్ర ప్రభుత్వం తరపున అఫిడవిట్ సమర్పించాలని, సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదిని కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడితో లేఖను రాయించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో సామాజిక సమతుల్యత లోపించిందని, మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు మాదిగలకు అవకాశం కల్పించాలన్నారు. అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖాళీ అయిన కడియం శ్రీహరి స్థానంలో మాదిగలకే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లు పెడుతామని ప్రకటించిన పార్టీకే బీసీలు మద్దతిస్తారన్నారని ఆర్ కృష్ణయ్య చెప్తుంటే.. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని.. వెంటనే కేంద్రానికి లేఖ రాయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏఏ అంశాలు తెరమీదకు వస్తాయో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








