Andhra Pradesh: దారి తప్పి ఊర్లోకి వచ్చిన జింక.. చుట్టుముట్టిన వీధి కుక్కలు.. చివరకు
దారి తప్పి ఊర్లోకి వచ్చిన జింకను చుట్టుముట్టాయి వీధి కుక్కలు. దాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి కొరికి చంపేశాయి. విద్యార్థులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం జోగింపేటలో దారుణం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ఆశ్రమ బాలుర పాఠశాలలోకి పక్కనే ఉన్న కొండ పై నుండి ఓ జింక వచ్చింది. జింకను గమనించిన వీధి కుక్కలు ఒకసారిగా దానిపై దాడి చేశాయి. కుక్కల దాడి చేస్తుండగా అక్కడే ఉన్న విద్యార్థులు జింకను కాపాడి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్థానిక పోలీసులు.. ఫారెస్ట్, వెటర్నరీ డాక్టర్లకు సమాచారం ఇచ్చారు.
హుటాహుటిన జింక వద్దకు చేరుకున్న వెటర్నరీ డాక్టర్లు జింక కు చికిత్స ప్రారంభించారు. అప్పటికే తీవ్ర గాయాల పాలైన జింక చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో చేసేదిలేక పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు అధికారులు. అయితే ఇప్పటికే కుక్కల దాడిలో జిల్లావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు జింక మృతి మరింత విషాదాన్ని నింపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
