
మానవత్వం, కుటుంబ బంధానికి అద్దం పట్టే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మగ దిక్కులేని తన కుటుంబానికి అన్నీతానై నిలబడింది ఓ కోడలు. తన అత్త ఆకస్మిక మృతితో దుఃఖాన్ని దిగమింగుకుని, తలకొరివి పెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరు, గున్నేపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
చెయ్యేరు గున్నేపల్లి గ్రామానికి చెందిన పాపిరెడ్డి ఆదిలక్ష్మి భర్త కొంతకాలం క్రితం మృతి చెందారు. దురదృష్టవశాత్తూ ఆమె కుమారుడు కూడా మరణించడంతో, ఆ కుటుంబంపై పెద్ద భారం పడింది. చిన్న పిల్లలు ఉన్న ఆ కుటుంబాన్ని ఆదిలక్ష్మి కోడలు, శ్రీదేవి ధైర్యంగా నెట్టుకొస్తోంది. శ్రీదేవి అత్త ఆదిలక్ష్మి దివ్యాంగురాలు కావడం, తన బిడ్డలు చిన్నవారు కావడం వల్ల, ఆమె గండెలలో బడబాగ్నిని దాచుకొని, వారికి ఏ లోటూ రాకుండా ఆలనాపాలనా చూసుకునేది.
అయితే ఆదివారం (నవంబర్ 2) మధ్యాహ్నం అకస్మాత్తుగా అత్త ఆదిలక్ష్మి మరణించడంతో, ఆ కుటుంబంపై పిడుగు పడినట్లయింది. ఈ క్లిష్ట సమయంలో శ్రీదేవి ధైర్యం కోల్పోలేదు. మగ దిక్కు లేని ఆ కుటుంబంలో, ఆమె తన అత్తకు చేయాల్సిన అన్ని అంతిమ క్రియలను నిర్వహించింది. కోడలు శ్రీదేవి తన అత్త పాడెను మోసి, సాంప్రదాయాలకు విరుద్ధంగా ఏ మాత్రం వెనుకాడకుండా అత్త చితికి నిప్పు పెట్టి తలకొరివిని అందించింది. ఈ సంఘటన స్థానికుల హృదయాలను కదిలించింది.
కన్న కొడుకులే తల్లిదండ్రులను సరిగా పట్టించుకోని ఈ ప్రస్తుత సమాజంలో, కోడలు శ్రీదేవి చూపిన చొరవను గ్రామస్థులు ప్రశంసించారు. ఆపదలో ఉన్న తన కుటుంబానికి అండగా నిలవడమే కాకుండా, అత్తకు చితి పేర్చడంలో ఆమె చూపిన ధైర్యం, ప్రేమానురాగాలు నిజంగా ఆదర్శప్రాయం అని స్థానికులు కొనియాడారు. ఆమె వెంట శ్మశాన వాటిక వద్దకు వెళ్లి ఆమెకు సహాయంగా పలువురు నిలిచారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..