Polavaram: పోలవరాన్ని సందర్శించిన సీడబ్ల్యూసీ.. ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి ముప్పు..!
గోదావరి వరదల తర్వాత పోలవరం (Polavaram) ప్రాజెక్టును మొట్టమొదటిసారిగా CWC పరిశీలించింది. అప్పర్ కాఫర్ డ్యామ్‌తో పాటు ప్రాజెక్ట్ ప్రజెంట్ సిట్యువేషన్ ఎలాగుందో చెక్ చేశారు. వందేళ్ల జులై నెల రికార్డును ఈ ఏడాది వచ్చిన వరదలు చెరిపేసిన విషయం...
గోదావరి వరదల తర్వాత పోలవరం (Polavaram) ప్రాజెక్టును మొట్టమొదటిసారిగా CWC పరిశీలించింది. అప్పర్ కాఫర్ డ్యామ్‌తో పాటు ప్రాజెక్ట్ ప్రజెంట్ సిట్యువేషన్ ఎలాగుందో చెక్ చేశారు. వందేళ్ల జులై నెల రికార్డును ఈ ఏడాది వచ్చిన వరదలు చెరిపేసిన విషయం తెలిసిందే. దీంతో వరదల తర్వాత ప్రాజెక్టును సీడబ్ల్యూసీ బృందం తనిఖీ చేసింది. సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఖయ్యూం మహ్మద్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం ప్రాజెక్టు స్థితిగతులపై అధ్యయనం చేశారు. ప్రజెంట్ సిట్యువేషన్, జరుగుతోన్న పనుల గురించి ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ అధికారుల నుంచి ఇన్‌పుట్ తీసుకున్నారు. ఊహించనిస్థాయిలో గోదావరి (Godavari) కి వరదలు పోటెత్తడం, అనేక ప్రాంతాలు నీట మునగడంతో పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై విమర్శలు చెలరేగాయి. పోలవరం బ్యాక్ వాటర్‌పై తెలంగాణ నుంచి అనేక అభ్యంతరాలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు కారణంగానే టెంపుల్ టౌన్ భద్రాచలం మునిగిపోయిందన్న తెలంగాణ ఈఎన్సీ లేఖపైనా సీడబ్ల్యూసీ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. బ్యాక్ వాటర్ ఎఫెక్ట్‌పై ఇండిపెండెంట్ సంస్థతో స్టడీ చేయించాలని కోరుతోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక ఇప్పుడొచ్చిన వరదలే మళ్లీ వస్తే.. భద్రాచలం పూర్తిగా నీట మునిగిపోవడం ఖాయమని తెలంగాణ ఆందోళ వ్యక్తం చేస్తోంది.
కాగా.. పోలవరం డ్యాం నిర్మాణంపై ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌పై అధ్యయనం చేయాలని కోరింది. పోలవరం నిర్మాణం పూర్తయితే వెనుక జలాలతో భద్రాచలం ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేస్తే ఏటా భద్రాచలానికి ముప్పేనని లేఖలో తెలిపింది. ఫలితంగా పోలవరం బ్యాక్ వాటర్‌పై అధ్యయనం చేయించాలని కోరింది.
మరోవైపు.. చరిత్రలో కనివీని ఎరుగని రీతిలో ఈ ఏడాది జూలైలో గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. ఒకానొక దశలో వరద 70 అడుగులు దాటింది. భద్రాచలం రామాలయం చెంతకు నీరు చేరింది. పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. భద్రాచలం దగ్గర గోదారిలో 31 అడుగుల నీటిమట్టం దాటితే పర్ణశాల మునిగిపోతుంది. ఇప్పుడు పోలవరం పూర్తైతే ఎప్పుడూ భద్రాచలం వద్ద 43 అడుగుల నీటి మట్టం ఉంటుంది. అదే జరిగితే పర్ణశాల ప్రాంతం జలగర్భంలోకి వెళ్లిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి