ఏపీలోని విశాఖపట్నంలో మరో పొలిటికల్ దుమారం రాజుకుంది. అయితే ఈ వివాదం మొత్తం ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రసాదరెడ్డి చుట్టూ తిరుగుతోంది. విశాఖ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవలే షెడ్యూల్ వచ్చింది. ఇప్పటికే ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. మార్చి 13న పోలింగ్ జరగనుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఏయూ వీసీ ప్రసాదరెడ్డి పాల్గొన్నారని వామపక్షాలు, టీడీపీ, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి..
అయితే, YCP MLC అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు మద్దతుగా నిన్న విశాఖలోని ఓ హోటల్లో మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన, ఉత్తరాంధ్ర వైసీపీ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. అయితే ఈ సమావేశాన్ని ఏయూ వీసీ ప్రసాదరెడ్డే నిర్వహించారని ఆరోపిస్తున్నాయి వామపక్షాలు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కాలేజ్‌లన్నీ ఏయూ కిందకే వస్తాయి. అందుకే ఆయా జిల్లాల్లోని ప్రైవేట్ కాలేజ్‌ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి.. వైసీపీకి ఓట్లు వేయాలని సూచించినట్లు వామపక్షాలు ఆరోపిస్తున్నాయి.. ఈ అంశంపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశాయి. వెంటనే వీసీ ప్రసాదరెడ్డిని విధుల్లోంచి తప్పించాలని డిమాండ్ చేశాయి.
అయితే ఈ ఆరోపణలను వైసీపీ ఖండిస్తోంది. చేతకాని వాళ్లే ఇలాంటి ఫిర్యాదులు చేస్తారని ఆరోపించారు మంత్రి బొత్స. ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. ఇదిలాఉంటే.. వీసీని తప్పించాలంటూ విశాఖ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..