Jagananna Vidya Deevena: సంక్షేమ పథకాల పంపిణీలో మరింత స్పీడ్ పెంచుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ క్రమంలోనే.. ఏపీ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. నేడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి.. జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి నగదు జమ చేయనున్నారు. బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కొవ్వూరు చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు రోడ్‌షోలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి భద్రతా ఇబ్బందులు తలెత్తకుండా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు అధికారులు. ఆ తర్వాత.. కొవ్వూరు సత్యవతినగర్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్. జగనన్న విద్యాదీవెన పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు.
ఇప్పటికే సభా ప్రాంగణం వద్ద భద్రతా ఏర్పాట్లు, రోడ్డు మార్గాన్ని ఉన్నతాధికారులతో కలిసి పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్, ఎస్పీ. మరోవైపు.. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో కొవ్వూరులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రాజమండ్రి- కొవ్వూరు మధ్య వాహనాలను గామన్ వంతెన, ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా మళ్లించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. కొవ్వూరు పట్టణంలోకి బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలతోపాటు ఏ వాహనాలు వెళ్లేందుకు అనుమతులు లేవని చెప్పారు.. రోడ్డు కం రైలు వంతెనపైనా, ధవళేశ్వరం బ్యారేజ్‌పైనా వన్‌వే ట్రాఫిక్ అమలు చేయనున్నట్లు తెలిపారు.
ఇక.. కొవ్వూరు కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి బయల్దేరి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు సీఎం జగన్. వాస్తవానికి.. సీఎం జగన్.. కొవ్వూరు పర్యటన రెండు సార్లు వాయిదా పడింది. మొదట ఏప్రిల్ 14న, తర్వాత మే 5న సీఎం జగన్ కొవ్వూరులో పర్యటిస్తారని అధికారులు చెప్పినప్పటికీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. రెండు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఇవ్వాళ కొవ్వూరులో పర్యటించబోతున్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా.. తూర్పుగోదావరి జిల్లాపై సీఎం జగన్ ఎలాంటి హామీల వర్షం కురిపిస్తారో చూడాలి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..