మరోసారి హస్తినకు సీఎం చంద్రబాబు.. ఈ అంశాలపై ప్రధానితో చర్చ..

|

Jul 16, 2024 | 6:55 PM

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. మరికాసేపట్లో ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతోపాటు పలువురు కేంద్రమంత్రులను మరోసారి కలవనున్నారు.

మరోసారి హస్తినకు సీఎం చంద్రబాబు.. ఈ అంశాలపై ప్రధానితో చర్చ..
Cm Chandrababu
Follow us on

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. మరికాసేపట్లో ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతోపాటు పలువురు కేంద్రమంత్రులను మరోసారి కలవనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రెండవసారి ఢిల్లీ పర్యటన చేపట్టారు. రాష్ట్రానికి రావల్సిన నిధుల విషయంలో ఢిల్లీ పెద్దలతో మరోసారి చర్చించనున్నారు. జూలై 3న ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు దాదాపు మూడు రోజుల పాటూ అక్కడే ఉన్నారు. వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరించారు. ఇదాలా ఉంటే గతంలో అనేక అంశాలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు దీనిపై ఒక నివేదికను కూడా కేంద్రం పెద్దలకు సమర్పించినట్లు సమాచారం. తాజాగా కేబినెట్ సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. ఉచిత ఇసుక పాలసీతోపాటూ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీంతో పాటూ ఆగస్ట్ 15 నుంచి 180కి పైగా అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చి పేదల ఆకలి తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

దీంతో పాటూ మరీ ముఖ్యంగా జూలై 23 నుంచి మూడు రోజులపాటూ అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక నిర్ణయం వెలువడనప్పటికీ పరిస్థితులు అన్నీ చక్కబెట్టుకునేందుకు కేంద్రం నుంచి తగిన సాయం పొందేందుకు ప్రణాళికల్లో భాగంగా ఈ ఢిల్లీ పర్యటన ఉండనున్నట్లు సమాచారం. ఒక వైపు సంక్షేమ పథకాలు, అభివృద్దికి కావల్సిన నిధులను సమకూర్చుకునేందుకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఙప్తి చేసేందుకు మరోసారి ఢిల్లీకి వెళ్లారు సీఎం చంద్రబాబు. వీటన్నింటితో పాటూ విభజన హామీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ప్రత్యేకంగా కోరనున్నారు. గత వారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా చర్చలు జరిపారు. అపరిష్కృత విభజన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకునేందుకు మంత్రులు, అధికారులతో ఒక కమిటీని వేశారు. ఈ విషయాన్ని కూడా కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలకు సంబంధించి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించాలని కోరనున్నట్లు సమాచారం. దీంతో పాటూ రాష్ట్రానికి రావల్సిన నిధులను సత్వరమే విడుదల చేయాలని కోరనున్నారు. ఈ క్రమంలో పదిహేను రోజుల వ్యవధిలో సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..