4 విడతలు, 68 మార్పులు.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా వైసీపీ సీట్ల మార్పు..
డిసెంబర్ 11న మొదలైన ఈ సీట్ల మథనం.. జనవరి 18 వరకు 4 విడతలుగా సాగింది. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు కలిపి.. ఇప్పటి వరకు 68 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు సీఎం జగన్. మరో 12 మంది ఎంపీ అభ్యర్థులను, ఐదారుగురు ఎమ్మెల్యే స్థానాలకు కూడా మారుస్తారని చెప్పుకుంటున్నారు...
వైసీపీలో మార్పుల లిస్టులు విడుదల అవుతూనే ఉన్నాయి. ఇప్పటికి నాలుగు జాబితాలు విడుదలయ్యాయి. త్వరలోనే మరిన్ని రాబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ చాలా జాగ్రత్తగా, వ్యూహాలు-ప్రణాళికలతో పావులు కదుపుతున్నారు. ఇందుకోసం పలుసార్లు సర్వేలు చేయించి, సామాజిక సమీకరణాల లెక్కలను పరిగణలోకి తీసుకుని మరీ మార్పులకు శ్రీకారం చుట్టారు. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావించిన వారి విషయంలో.. చాలా కఠినంగా వ్యవహరిస్తూ పక్కకు పెట్టేస్తున్నారు.
డిసెంబర్ 11న మొదలైన ఈ సీట్ల మథనం.. జనవరి 18 వరకు 4 విడతలుగా సాగింది. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు కలిపి.. ఇప్పటి వరకు 68 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు సీఎం జగన్. మరో 12 మంది ఎంపీ అభ్యర్థులను, ఐదారుగురు ఎమ్మెల్యే స్థానాలకు కూడా మారుస్తారని చెప్పుకుంటున్నారు. అయితే, ఇలా మార్పులు చేసిన నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలే ఎక్కువగా ఉన్నాయన్న విమర్శ ప్రతిపక్షాల నుంచి చాలా బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో ఓసీలు ఉన్నచోట మాత్రం.. సిట్టింగ్‌ల వారసులకు చోటు కల్పించారనేది ప్రతిపక్షం వాదన.
ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు కేవలం రిజర్వ్‌డ్ స్థానాల్లో మాత్రమే మార్పులు జరగలేదు. కీలకమైన కమ్మ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు, కాపు, రెడ్డి నియోజకవర్గాల్లోనూ మార్పులు చేశారు సీఎం జగన్. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటర్లు ఇప్పటికీ వైసీపీకి అత్యంత బలమైన ఓటు బ్యాంక్. అయినా సరే.. రిజర్వ్‌డ్ స్థానాల్లో వారిని మారుస్తున్నారంటే.. సీఎం జగన్ ఓ పక్కా ప్రణాళికతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని కౌంటర్ ఇస్తోంది అధికారపక్షం.
మొదటి జాబితాలో ఐదు ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. మొన్నటి నాలుగో జాబితాకు వచ్చేసరికి ఏకంగా 8 చోట్ల ఎస్సీ అభ్యర్థులను మార్చారు. 9 స్థానాలతో నాలుగో జాబితా ప్రకటిస్తే.. అందులో 8 ఎస్సీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చేశారు సీఎం జగన్. ఇప్పటివరకు జరిగిన మార్పులను గనక గమనిస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి.
సర్వేలు, సామాజిక సమీకరణాలతో పాటు ప్రజాదరణను పరిగణలోకి తీసుకున్న సీఎం జగన్.. అభ్యర్థుల్ని మార్చడం లేదా సీటు నిరాకరించారు. ఏదేమైనా సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్యేలకు పెద్ద షాక్ ఇస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ప్రజల్లో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేని వాళ్లు, గెలిచే అవకాశాలు బాగా తక్కువగా ఉన్నవారికి మాత్రమే టికెట్ నిరాకరిస్తున్నారంటున్నారు వైసీపీ పెద్దలు.
సిట్టింగులను మారిస్తే.. కొంత వ్యతిరేకత రావొచ్చు. అందుకే, ఆషామాషీగా మార్పులు చేయడం లేదంటున్నారు కొందరు సీనియర్లు. ఐప్యాక్ సర్వేతో పాటు సొంతంగా చేయించుకున్న సర్వేల ఆధారంగానే సీఎం జగన్.. చాలా జాగ్రత్తగా ముందడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. గెలుపు గుర్రాలు, సునాయాసంగా గెలుస్తారనుకున్న వారికి మాత్రమే టికెట్లు ఇస్తున్నారు. నిజానికి.. ఈ మార్పులు కొత్తేం కాదు. ప్రతి పార్టీలో, ప్రతి ఎన్నికలప్పుడు జరిగేవే. కాకపోతే, ఈసారెందుకో కాస్త ఎక్కువ ఫోకస్ అవుతూ, హైలెట్ అవుతున్నాయి. పనితీరు సరిగా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు టికెట్లు నిరాకరించడం దశాబ్దాలుగా వస్తున్న ఓ రాజకీయ సంప్రదాయం.
కాకపోతే, సిట్టింగ్‌ల మార్పులను ప్రతిపక్షాలు మరోలా కన్వర్ట్ చేస్తున్నాయి. సీఎం జగన్ పనితీరుకు లింక్ చేసి.. వైసీపీ పాలన బాగోలేదనడానికి టికెట్ల మార్పులే నిదర్శనం అంటూ ప్రచారం చేస్తున్నాయి. నిజంగా సీఎం జగన్ పాలన అత్యద్భుతంగా ఉంటే.. ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నిస్తున్నాయి. ఈ నాలుగున్నరేళ్లలో ఎమ్మెల్యేలు బాగా పనిచేయలేదు కాబట్టే మార్పులు అనివార్యం అయ్యాయని దాడి చేస్తున్నాయి. ఇప్పటి వరకు 68 మందిని మార్చడం ద్వారా.. ప్రభుత్వ పాలన బాగోలేదని సీఎం జగన్ పరోక్షంగా ఒప్పుకున్నట్టేనని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.
ప్రతిపక్షాలు ఇలా ప్రచారం చేస్తున్నాయి గానీ.. సీఎం జగన్ ఎప్పుడో చెప్పారు. మరోరకంగా చెప్పాలంటే.. చాలాసార్లు హెచ్చరిస్తూ వచ్చారు కూడా. పనితీరు బాగాలేకపోతే తాను కూడా ఏమీ చేయలేనని, నిర్మొహమాటంగా పక్కన పెడతానని సీఎం జగన్ చెబుతూ వచ్చారు. చెప్పినట్టుగానే.. ఎమ్మెల్యేలతో ఒక్కో కార్యక్రమం చేయించి, వారి పర్ఫార్మెన్స్ రిపోర్టులు తెప్పించుకున్నారు. పనితీరు సరిగా లేని వారిని కొన్ని సందర్భాల్లో హెచ్చరించారు కూడా. పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. అయినా సరే.. తీరు మార్చుకోని వారినే పక్కనపెడుతున్నారు. అందులోనూ.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవడంతో సీఎం జగన్ మరింత అలర్ట్ అయ్యారు. ప్రజాదరణ లేని, గెలుపు అవకాశాలు లేని ఎమ్మెల్యేల విషయంలో.. ఏమాత్రం రాజీపడకూడదని డిసైడ్ అయ్యారు.
మరోవైపు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో టీడీపీ-జనసేన కలిసి బరిలో దిగుతున్నాయి. కొత్తగా వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇచ్చారు. ఒకేసారి ఇన్ని పరిణామాలు జరుగుతున్నా గానీ.. వైనాట్-175 అంటున్నారు సీఎం జగన్. దీంతో పార్టీలో కొందరు అసంతృప్తులు ఉన్నా.. వాటిని లెక్కచేయకుండా అభ్యర్ధుల్ని ఖరారు చేస్తున్నారు సీఎం జగన్. తన సర్వేలు, సమీకరణాల లెక్కలపై ఉన్న ధీమాతోనే ధైర్యంగా మార్పులు-చేర్పులు చేస్తున్నారు.
ఏపీలోని పల్లె ప్రాంతాల్లో వైసీపీ తిరుగులేని బలంతో ఉంది. కాకపోతే, పట్టణాలే కొంత కలవరపెడుతున్నాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లో భారీగా మార్పులు చేర్పులు చేస్తున్నారు సీఎం జగన్. విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, చిలకలూరిపేట, అనకాపల్లి, చిత్తూరులో కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. రాయదుర్గం, కల్యాణదుర్గం, మంగళగిరి, ఆలూరు, ఎమ్మిగనూరు, పెనుకొండ ప్రాంతాల్లో కూడా మార్పులు చేశారు. ఎంత మార్పులు చేసినా.. తాము మాత్రం సామాజిక న్యాయానికే కట్టుబడి ఉన్నామని వైసీపీ చెబుతుంటే.. రిజర్వ్‌డ్ స్థానాల్లోని వారినే మారుస్తున్నారంటూ ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ఏదేమైనా.. ఈ విమర్శలను గట్టిగా తిప్పికొట్టకపోతే మాత్రం వైసీపీకే నష్టం చేకూరుస్తాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..