AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: ప్రజల రుణం తీర్చుకుంటాం.. ఎన్డీఏతోనే మా ప్రయాణం.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు.. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం.. ఏదిఅంటే అది చేస్తాననే ధోరణిని ప్రజలు తిరస్కరించారు.. అహంకారంతో వెళ్లే ఏ పాలకులకైనా ఇదే జరుగుతుంది.. అంటూ ఏపీలో కూటమి విజయంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chandrababu: ప్రజల రుణం తీర్చుకుంటాం.. ఎన్డీఏతోనే మా ప్రయాణం.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
Chandrabau Naidu
Shaik Madar Saheb
|

Updated on: Jun 05, 2024 | 11:18 AM

Share

ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు.. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం.. ఏదిఅంటే అది చేస్తాననే ధోరణిని ప్రజలు తిరస్కరించారు.. అహంకారంతో వెళ్లే ఏ పాలకులకైనా ఇదే జరుగుతుంది.. అంటూ ఏపీలో కూటమి విజయంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి విజయం అంనతరం ప్రెస్‌మీట్‌ నిర్వహించిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు విషయాలను కీలకంగా ప్రస్తావించారు. తన రాజకీయ చరిత్రలో.. ఈ ఐదేళ్ల చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి.. భావితరాల భవిష్యత్తు కోసం పాటుపడతాం.. అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం, ఎవరూ శాశ్వతం కాదు.. ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదంటూ వ్యాఖ్యానించారు. తనతో సహా తమ అభ్యర్థులందరూ భారీ మెజార్టీతో గెలిచారన్నారు. భారీ మెజార్టీని ఏవిధంగా అభివర్ణించాలో తెలియడంలేదన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేశారన్నారు. ఓడితే కుంగిపోలేదు..గెలిచినప్పుడు గంతులేయలేదని.. ప్రజల రుణం తీర్చుకుంటామంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం.. ఏదంటే అది చేస్తాననే ధోరణిని ప్రజలు తిరస్కరించారని.. అహంకారంతో వెళ్లే ఏ పాలకులకైనా ఇదే జరుగుతుందని చంద్రబాబు అన్నారు. కార్యకర్తల త్యాగాల ఫలితమే ఈ విజయమన్నారు. కూటమికి బీజం వేసింది పవన్‌ కల్యాణే.. అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని..పవన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి సమానంగా పనిచేశాయంటూ వివరించారు.

గత ప్రభుత్వం అప్పుల గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు. ఎక్కడెక్కడ అప్పులు చేశారో తెలియదని, అన్ని గమనించాల్సి ఉందని తెలిపారు. గత అసెంబ్లీలో తనకు, తన భార్యకు, తన కుటుంబానికి జరిగిన అవమానాన్ని భరించలేకపోయానని చంద్రబాబు అన్నారు. తనపై బాంబులు వేసినప్పుడు కూడా అలా బాధపడలేదన్నారు. అప్పుడు సీఎంగానే వస్తానని ప్రతిజ్న చేశానని.. తన విజయానికి అందరూ తోడ్పాటునందించారని తెలిపారు. మూడు పార్టీలు సమిష్టిగా పనిచేశాయని చంద్రబాబు పేర్కొన్నారు.

అయితే.. ఇండియా కూటమిలోకి వెళ్తున్నారా..? అని మిడియా అడిగిన ప్రశ్నపై చంద్రబాబు స్పందించారు.. తనకు రాజకీయ అనుభవం చాలా ఉందని .. ఎన్నో ఒడిదుడుకులను చూశామంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఎన్డీఏతో ఉన్నామని.. ఎన్డీఏతోనే తమ ప్రయాణమన్నారు. ఈరోజు ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నామని.. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత అన్ని వివరిస్తానని చంద్రబాబు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఎన్డీఏ కూటమి -164 (టీడీపీ-135, జనసేన 21, బీజేపీ 8) స్థానాల్లో విజయం సాధించగా.. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..