Andhra Pradesh: వాలంటీర్ల జీతం నెలకు 10 వేలకు పెంచుతాం.. చంద్రబాబు బంఫర్ ఆఫర్.. వైసీపీ కౌంటర్..
ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ వార్... డైలీ సీరియల్ మాదిరి కొనసాగుతోంది. లబ్దిదారులకు ఇంటికే చేరాల్సిన పెన్షన్లు.. ఈసారి ఆలస్యం కావడంతో.. ఈ ఇష్యూ కాస్తా రాజకీయ లడాయికి దారితీసింది. వాలంటీర్ల సేవలకు ఈసీ బ్రేకులేసింది మొదలు.. పాలక, ప్రతిపక్షాల మధ్య నాన్‌స్టాప్‌గా సాగుతున్న మాటల యుద్ధం పీక్స్‌కు చేరిపోయింది.
ఏపీ పాలిటిక్స్ సమ్మర్‌ను మించి హీటెక్కుతున్నాయి. అధికార, విపక్షాల పార్టీల మధ్య ప్రతీ ఇష్యూపై రాజకీయ రచ్చ రాజుకుంటుంది. పెన్షన్ల పంపిణీ- వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ-కూటమి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు హోరెత్తుతున్నాయి. వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఇటీవలే ఈసీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ కేంద్రంగా రచ్చ రాజుకుంది. చంద్రబాబు అండ్ కో వాలంటీర్ల వ్యవస్థపై ఈసీకి ఫిర్యాదు చేయడం వల్లే పెన్షన్లు ఆలస్యమయ్యయాని..పలువురి మరణాలకు కారణమయ్యారని వైసీపీ ఆరోపించింది. అయితే ప్రత్యామ్నాయలు చేయడంలో విఫలమై తమపై నిందలేస్తారా? అని టీడీపీ ప్రశ్నిస్తోంది.
వాలంటీర్ వ్యవస్థపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. వాలంటీర్ల జీతం నెలకు 10 వేలకు పెంచుతామన్నారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.
వాలంటీర్ల పారితోషికం రూ.10 వేలకు పెంచుతామన్న చంద్రబాబు హామీపై పేర్నినాని స్పందించారు. వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేయాలని చంద్రబాబు భావించారని, అది కుదరకపోయేసరికి ఇప్పుడు వారిపై కల్లబొల్లి ప్రేమ ఒలకబోస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని సూచించారు. తాయిలాలు ప్రకటిస్తున్నారంటే వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ నిదర్శమన్నారు పేర్నినాని.
వాలంటీర్లు రెండున్నర లక్షల మంది తన సైన్యంగా గతంలోనే చెప్పారు ఏపీ సీఎం జగన్. అదే వాలంటీర్లు ఇప్పుడు టీడీపీ, జనసేనకు కీలకమైనట్లు తెలుస్తోంది. మరోవైపు వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. మళ్లీ అధికారంలోకి వచ్చి సెట్ చేస్తానని జగన్ చెబుతున్నారు. మొత్తంగా ఏపీ ఎన్నికలవేళ ఓటర్లతోపాటు వాలంటీర్లు ఓ బ్రాండ్ అయిపోయారు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..