Chandrababu Tour: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఓ వైపు అధికార వైఎస్ఆర్‌సీపీ గడగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంతో దూసుకుపోతుండగా.. టీడీపీ కూడా ఇదే తరహాలో ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించింది. ఏపీలో మాటల యుద్ధం, పొత్తుల ఎత్తులు జోరుగా నడుస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల్లోకి వెళ్లి.. పార్టీని మరింత బలోపేతం చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మరోసారి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.
ఈ నెల 15నుంచి చంద్రబాబు మలివిడిత జిల్లా పర్యటనలు మొదలుకానున్నాయి. ఈ మేరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 15 నుంచి నెలకు రెండు జిల్లాల్లో బాబు టూర్లు నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో మూడు రోజులపాటు పర్యటన ఉండనుంది. ఈ నెల 15,16,17 తేదీల్లో అనకాపల్లి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. మొదటి రోజు మినీ మహానాడు బహిరంగ సభ, రెండో రోజు పార్టీ నేతలతో సమావేశాలు, మూడో రోజు రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇలా ఏడాదిపాటు అన్ని జిల్లాల్లో విస్తృత పర్యటనలు చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
అనకాపల్లి పర్యటన షెడ్యూల్ వివరాలు..
15న చోడవరంలో నిర్వహించే జిల్లా మహానాడులో చంద్రబాబు పాల్గొంటారు. జిల్లా మహానాడులో భాగంగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. 16న అనకాపల్లిలో నియోజకవర్గాల వారీ సమీక్షలు నిర్వహించనున్నారు. అలాగే 17న చీపురుపల్లిలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి 26 జిల్లాలలో ఏడాది పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. ఒక్కో టూర్ మూడు రోజుల చొప్పున నెలకు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.