AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటుపై బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై నోటిఫికేషన్ జారీ చేసింది. దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు చేస్తూ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఏపీ ప్రజల కోరిక నెరవేరింది. జోన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.

Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటుపై బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
Vishaka
Eswar Chennupalli
| Edited By: |

Updated on: May 05, 2026 | 10:24 AM

Share

ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ  కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా జోన్ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ఇందులో తెలిపింది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే విశాఖలో జోన్ కార్యాలయం, ఇతర భవన సముదాయాల పనులు పూర్తి కావొచ్చాయి. త్వరలోనే వీటిని ప్రారంభించనున్నారు. అలాగే ఇతర జోన్ల పరిధిలోని అధికారులను  ఇక్కడికి బదిలీ చేయనున్నారు. ఈ క్రమంలో రైల్వే జోన్‌కు అధికారిక హోదా కల్పిస్తూ కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ గెజిట్ విడుదల చేసింది. విశాఖ కేంద్రంగా ఈ కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

విభజన సమయంలో ఇచ్చిన హామీ

రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలలో అత్యంత కీలకమైనది విశాఖ రైల్వే జోన్. ఆంధ్రప్రదేశ్ విభజనతో పరిపాలన, ఆర్థిక పరంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపుగా, అభివృద్ధికి దోహదపడేలా ఈ జోన్ అవసరమని అప్పట్లోనే కేంద్రం హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ అమలు మాత్రం దాదాపు దశాబ్ద కాలం పాటు సాగిన పోరాటాలు, చర్చలు, మార్పులు, సందేహాల మధ్య నెమ్మదిగా ముందుకు వచ్చింది. చివరకు ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్‌తో దక్షిణ కోస్తా రైల్వే జోన్ రూపుదిద్దుకోవడం ఒక దీర్ఘ ప్రయాణానికి ముగింపు, కొత్త దశకు ఆరంభంగా మారింది. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాలను భర్తీ చేయడానికి కేంద్రం పలు హామీలు ఇచ్చింది. వాటిలో విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కూడా ఒకటి. విశాఖ భౌగోళికంగా, పారిశ్రామికంగా, పోర్ట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా కీలక కేంద్రంగా ఉండటంతో ఇక్కడ జోన్ అవసరం ఉందనే అభిప్రాయం అప్పట్లోనే బలంగా వ్యక్తమైంది.

సంవత్సరాల పాటు సాగిన ఉద్యమాలు

విభజన తర్వాత ఈ హామీ అమలు విషయంలో ఆలస్యం పెరిగింది. దీనిపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు తరచూ ఆందోళనలు చేపట్టాయి. విశాఖలో రైల్వే జోన్ కోసం నిరసనలు, ర్యాలీలు, బంద్‌లు కూడా జరిగాయి. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరంతరం ఒత్తిడి కొనసాగింది. 2019లో కేంద్రం దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ప్రకటించింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా ఉంటుందని తెలిపింది. అయితే అదే సమయంలో వాల్తేరు డివిజన్‌ను విభజించడం, ముఖ్యమైన ఆదాయ వనరులు ఇతర జోన్లకు వెళ్లేలా ప్రతిపాదనలు రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జోన్ ఇచ్చినా ఉపయోగం ఏంటి? అన్న ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. వాల్తేరు డివిజన్ అనేది ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అత్యంత ఆదాయాన్ని అందించే కీలక డివిజన్. దీనిని విభజించి భాగాలను ఇతర జోన్లకు కేటాయిస్తే, విశాఖ జోన్ బలహీనపడుతుందని అభిప్రాయాలు వచ్చాయి. దీనిపై రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు.

పునర్వ్యవస్థీకరణలో మార్పులు

తదుపరి దశలో కేంద్రం పునర్వ్యవస్థీకరణలో కొన్ని మార్పులు చేసింది. వాల్తేరు డివిజన్‌ను విభజించినా, విశాఖపట్నం డివిజన్‌గా మార్చి కొత్త జోన్‌లో భాగంగా చేర్చేలా ప్రణాళికలు రూపొందించింది. అదే సమయంలో గుంటూరు, విజయవాడ, గుంతకల్లు డివిజన్లను దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోకి తీసుకురావడం ద్వారా జోన్‌కు పరిపాలనా బలం కల్పించే ప్రయత్నం చేసింది.

గెజిట్ నోటిఫికేషన్‌తో స్పష్టత

ఇప్పుడు కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌తో ఈ ప్రక్రియకు పూర్తి స్పష్టత వచ్చింది. 2026 జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ప్రకటించింది. వాల్తేరు డివిజన్ విభజన, విశాఖపట్నం డివిజన్ ఏర్పాటు, రాయగడ డివిజన్‌ను ఈస్ట్ కోస్ట్ రైల్వేలో భాగంగా మార్చడం వంటి కీలక నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఇప్పుడు కొత్త జోన్‌లో కీలక భాగాలుగా మారుతున్నాయి. అలాగే కొన్ని మార్గాలను సికింద్రాబాద్ డివిజన్‌కు మార్చడం ద్వారా పరిపాలనా సమతుల్యతను తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఖుర్దా రోడ్, రాయగడ, విశాఖపట్నం డివిజన్ల మధ్య సరిహద్దులను కూడా పునర్నిర్వచించింది.

ఏపీకి కీలకం

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు రాష్ట్రానికి కేవలం పరిపాలనా మార్పు మాత్రమే కాదు. ఇది ఆర్థికంగా, పారిశ్రామికంగా, రవాణా పరంగా పెద్ద అవకాశాలను తీసుకువస్తుంది. పోర్టులు, పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగాలకు ఇది బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా విశాఖ, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుంది. దాదాపు పదేళ్ల తర్వాత విశాఖ రైల్వే జోన్ హామీ ఇప్పుడు కార్యరూపం దాల్చింది. మధ్యలో వచ్చిన వివాదాలు, మార్పులు, ఉద్యమాల తర్వాత వచ్చిన ఈ నిర్ణయం రాష్ట్రానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది. ఇక అమలు ఎలా ఉంటుంది, అభివృద్ధి ఎంతవరకు జరుగుతుంది అన్నది వచ్చే రోజుల్లో చూడాల్సి ఉంది.

Follow Us