
లంపీ స్కిన్ వైరస్ పల్నాడు జిల్లాను కలవరపెడుతోంది. స్కిన్ వైరస్ పల్నాడు జిల్లా పశువులను కాటేస్తోంది. వైరస్ సోకి పశువులు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నాయి. వ్యాక్సిన్ లేదంటూ ప్రభుత్వ వైద్యులు చెబుతుండటంతో పశువుల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో లంపీ స్కిన్ వైరస్ భయాందోళన కలిగిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆవులు, ఎడ్ల చర్మంపై బొబ్బలు, మచ్చలు, కాళ్ల వాపు లక్షణాలు రావడంతో రైతులు కలవరానికి గురవుతున్నారు. ముఖ్యంగా అచ్చంపేట, క్రోసూరు మండలాలను బోన్‌లెస్ వైరస్ తీవ్రంగా వేదిస్తుందని ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికే వైరస్ భారినపడి అచ్చంపేట మండలంలో చాలావరకు పశువులు చనిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైరస్ ప్రభావంతో ఇప్పటికే నెల రోజులుగా క్రోసూరులో తెల్లజాతి పశువుల సంతను అధికారులు మూసివేశారు. వైరస్‌ను అరికట్టేందుకు ఇంకా వ్యాక్సిన్ తయారు కాకపోవడం, ప్రభుత్వ పశువైద్యులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రైవేటు వైద్యులు ఇదే అదుగా భావించి వైరస్ మాటున అధికధరలు వసూలు చేస్తూ రైతుల జేబులు గుల్ల చేస్తున్నారని వాపోతున్నారు. పశువుల వైద్య ఖర్చులు విపరీంగా పెరిగిపోతున్నాయని అంటున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, పశుసంవర్ధకశాఖ స్పందించి పశువులను కాపాడే చర్యలు ప్రారంభించాలని కోరుతున్నారు. వైరస్‌ను అరికట్టేలా వ్యాక్సిన్ వెంటనే ప్రభుత్వం తరపున పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.