Andhra Pradesh: బీఎస్ రావు వర్సెస్ లింగమనేని రమేష్.. పరస్పరం సంచలన ఆరోపణలు..
ఇద్దరు బిగ్ షాట్సే.. ఒకరు విద్యా సంస్థలకు అధిపతి అయితే మరొకరు వ్యాపార దిగ్గజం. వారిద్దరి మధ్య ఇప్పుడు రచ్చ మొదలయ్యింది. 310 కోట్ల రూపాయలకు తనను మోసం చేశారని ఒకరు ఆరోపిస్తుంటే..
ఇద్దరు బిగ్ షాట్సే.. ఒకరు విద్యా సంస్థలకు అధిపతి అయితే మరొకరు వ్యాపార దిగ్గజం. వారిద్దరి మధ్య ఇప్పుడు రచ్చ మొదలయ్యింది. 310 కోట్ల రూపాయలకు తనను మోసం చేశారని ఒకరు ఆరోపిస్తుంటే.. తాను ఏ తప్పు చెయ్యలేదని మరొకరు అంటున్నారు. అసలింతకీ.. ఎవరా బిగ్ షాట్స్.. ఏమిటా వివాదం? వివరాలు ఇప్పుడు చూద్దాం..
బీఎస్ రావు వర్సెస్ లింగమనేని..
ప్రముఖ పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ తనను రూ. 310 కోట్లకు మోసం చేశారంటూ చైతన్య గ్రూప్ ఛైర్మన్ బీఎస్ రావు చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తమ కాలేజీలను విస్తరించేందుకు భూములు భవనాలు ఇస్తామని చెప్పి పెట్టుబడి పేరుతో తమ దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించారని ఆయన ఆరోపించారు. సరిగ్గా పదేళ్ల క్రితం అంటే 2012-2013 మధ్యకాలంలో సుమారు 310 కోట్ల రూపాయలు ఆయనకు ఇచ్చామని బీఎస్ రావు అంటున్నారు. ఇస్తామన్న భూములు ఇవ్వలేదని.. డబ్బులు తిరిగి ఇస్తామంటూ ఆయన ఇచ్చిన చెక్కులు చెల్లలేదన్నది ఆయన ప్రధాన ఆరోపణ. రెండు మూడేళ్లు వేచి చూసినప్పటికీ 2015 నాటికి ఆయన తీరుపై డౌట్ వచ్చిందన్నారు బీఎస్ రావు.
బీఎస్‌రావు ఆరోపణలు ఖండించిన లింగమనేని రమేష్..
చైతన్య గ్రూప్ బీఎస్‌రావు ఆరోపణల్ని లింగమనేని రమేష్ ఖండించారు. తనకు బీఎస్‌రావుకు మధ్య కేవలం 137 కోట్ల రూపాయల వివాదం మాత్రమే ఉందంటూ ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ విషయంలో పరస్పరం కేసులు పెట్టుకున్నామని, ప్రస్తుతం ఆ కేసులు న్యాయపరిధిలో ఉన్నందున తానేం వ్యాఖ్యానించదలచుకోలేదన్నది ఆయన వాదన. తాను తప్పు చేసినట్టు ఏ కోర్టు తీర్పు ఇవ్వలేదని కూడా తన ప్రెస్ నోట్లో ప్రస్తావించారు. ఈ కేసుల విషయంలో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని NCLT, అమరావతి బెంచ్‌లో ఈ కేసుల్ని కొట్టివేశారన్న విషయాన్ని కూడా తెలిపారు. కేవలం వ్యాపార లావాదేవీలను అడ్డుపెట్టుకొని తన పరువు ప్రతిష్టలకు భంగం కల్గించే దురుద్ధేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ లింగమేనని వివరణ ఇచ్చారు.
అయితే ఈ వివాదంపై సుప్రీం కోర్టుకు కూడా వెళ్లామని అన్నారు బీఎస్ రావు. నెలవారీ వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు ఆదేశించిందని అయినా లింగమనేని నుంచి ఎలాంటి స్పందన లేదని ఆరోపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..