ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి అన్నదమ్ములు.. కలిసిపోతారా..?

నల్లారి సోదరులు ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్‎లో దాదాపు 5 దశాబ్దాలకు పైగా ఉన్న కుటుంబం. పివి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన నల్లారి అమర్నాథ్ రెడ్డి వారసులుగా రాజకీయాల్లో కొనసాగుతున్న అన్నదమ్ములు కిరణ్, కిషోర్ లు ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మాజీ సీఎం నల్లారి కిరణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‎లు ఇద్దరూ తొలిసారి ఒకే పార్లమెంట్ స్థానంలో వేరువేరు పార్టీల నుంచి ఒకరు ఎంపీగా మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం నడుస్తుంది.

ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి అన్నదమ్ములు.. కలిసిపోతారా..?
Nallari Brothers

Edited By:

Updated on: Mar 10, 2024 | 3:43 PM

నల్లారి సోదరులు ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్‎లో దాదాపు 5 దశాబ్దాలకు పైగా ఉన్న కుటుంబం. పివి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన నల్లారి అమర్నాథ్ రెడ్డి వారసులుగా రాజకీయాల్లో కొనసాగుతున్న అన్నదమ్ములు కిరణ్, కిషోర్ లు ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మాజీ సీఎం నల్లారి కిరణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‎లు ఇద్దరూ తొలిసారి ఒకే పార్లమెంట్ స్థానంలో వేరువేరు పార్టీల నుంచి ఒకరు ఎంపీగా మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే పీలేరు అసెంబ్లీకి టిడిపి అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ తమ్ముడు నల్లారి కిషోర్ పోటీకి సిద్ధమయ్యారు. 2104, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పీలేరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. టిడిపి అభ్యర్థిగా పీలేరు నుంచి బరిలో ఉండనున్నారు. ఈ మేరకు టిడిపి అధిష్టానం కూడా నల్లారి కిషోర్ పొటీపై క్లారిటీ కూడా ఇచ్చింది. పీలేరు టిడిపి అభ్యర్థిగా ప్రకటించింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న మాజీ సీఎం కిరణ్ 2024 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టారు. పదేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి పోటీకి సిద్ధమవుతున్నట్లు ఇప్పటికే అనుచరగణంతో అభిప్రాయాన్ని పంచుకున్న మాజీ సీఎం కిరణ్ ఎక్కడి నుంచి పోటీలో ఉంటారన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్న మాజీ సీఎం కిరణ్ పొత్తులో భాగంగా ఎంపీగా పోటీ చేస్తారన్న చర్చ కేడర్‎లో నడుస్తోంది. ఇందులో భాగంగానే రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా బరిలో ఉంటారని తెలుస్తోంది. టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ రాజంపేట పార్లమెంటు నుంచి బరిలో దిగితే అదే పార్లమెంట్ పరిధిలోని పీలేరు అసెంబ్లీ నుంచి తమ్ముడు నల్లారి కిషోర్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దీంతో అన్నదమ్ములు ఇద్దరూ రాజంపేట ఎంపీగా ఒకరు, పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మరొకరు ఎన్నికల బరిలో ఉండడం ఉమ్మడి చిత్తూరు పాలిటిక్స్‎లో ఆసక్తికర పరిణామంగా మారబోతోంది. అయితే పొత్తుల లెక్క తేలినా పోటీ చేసే స్థానాలపై క్లారిటీ లేకపోవడంతో రాజంపేట పార్లమెంటు నుంచి బిజెపి పోటీ చేస్తుందా లేదా అన్న దానిపై సస్పెన్స్ వీడటం లేదు. దీంతో అన్నకు బీజేపీ నుంచి ఛాన్స్ దక్కే అవకాశంపై ఊహగానాలే వినిపిస్తున్నాయి. అయితే రాజంపేట పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా మాజీ సిఎం కిరణ్ పోటీ చేస్తారని పెద్ద ఎత్తున స్థానిక కేడర్‎లో ప్రచారం కూడా కొనసాగుతోంది.

2014, 2019 ఎన్నికలకు దూరంగా ఉన్న మాజీ సీఎం కిరణ్ 2024 ఎన్నికల బరిలో ఉంటానని ఇప్పటికే కిరణ్ కేడర్‎కు క్లారిటీ ఇవ్వడమే ఈ ప్రచారానికి కారణం అవుతుంది. అయితే కిరణ్ పోటీ పై బిజేపీ అధిష్ఠానం నుంచి ఇప్పటిదాకా నో క్లారిటీ అన్నట్లు పరిస్థితి నెలకొంది. రాజంపేట పార్లమెంట్ పరిధిలో మైనారిటీ ఓటర్లు రెండున్నర లక్షలకు పైగా ఉండడంతో బిజెపి పోటీపై ఆచితూచీ వ్యవహరిస్తోంది. అయితే కిరణ్‎కు రాజంపేట పార్లమెంట్ పరిధిలో పట్టు ఉండడంతో ఆయన్ని బరిలో దింపాలన్న ఆలోచన బిజెపి హై కమాండ్‎లో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి కిరణ్ పోటీ చేస్తారన్న ప్రచారం ఆయన అనుచరుల్లో కేడర్‎లో జోష్‎ను నింపుతోంది. ఇదే జరిగితే నల్లారి సోదరుల మధ్య గత ఐదేళ్లకు పైగా ఉన్న మనస్పర్ధలు ఎన్నికల్లో ఎలా పనిచేస్తాయో కేడర్‎కి అంతుచిక్కని పరిస్థితిగా మారింది. ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా బిజెపి అభ్యర్థిగా అన్న టిడిపి అభ్యర్థిగా తమ్ముడు ఎన్నికల ప్రచారంలో ఎలాంటి వ్యూహ ప్రతి వ్యూహాలు అనుసరిస్తారోనన్న చర్చ క్యాడర్ లో ఆసక్తిని కల్పిస్తోంది.

ఇవి కూడా చదవండి

రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న పీలేరులో అన్న కమలం గుర్తుతో తమ్ముడు సైకిల్ గుర్తుతో కలిసి ప్రచారం నిర్వహిస్తే ఆసక్తికర పరిణామంగానే ఉంటుందని స్థానికుల్లో చర్చ నడుస్తుంది. మాజీ సీఎంగా కిరణ్ సైలెంట్‎గా ఉన్న సమయంలో కేడర్‎ను కాపాడుకునేందుకు సైకిల్ ఎక్కిన తమ్ముడు నల్లారి కిషోర్ తీరును తప్పు పట్టడంతో నల్లారి సోదరుల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. దాదాపు 5 ఏళ్లకు పైగా కిరణ్ కిషోర్ మధ్య మాట్లాడుకోవడాలు లేకపోగా సొంతూరు నగిరిపల్లికి వచ్చినా మాజీ సీఎం కిరణ్ కలికిరిలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి పరిమితం కావాల్సి వస్తుంది. సొంతింటి గడప తొక్కేందుకు ఇబ్బంది పడ్డ కిరణ్ ఎన్నికల పొత్తు వ్యవహారంతో అన్నదమ్ముల మధ్య సఖ్యతకు చాన్స్ దక్కే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. మిత్రపక్షం అభ్యర్థులుగా ఇద్దరు పోటీ చేస్తే అన్నదమ్ముల కలయిక చూడాలని అనుచర గణం కూడా ఉబలాటపడుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..