అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లెలి ఆవేదనను చూసి ఆ అన్నయ్య కుమిలిపోయాడు. ఆమెకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ రాష్ట్ర స్థాయి అధికారులను ఆశ్రయించాడు. అయినా న్యాయం జరగకపోవడంతో.. దేశ రాజధాని ఢిల్లీకి పయనమయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన నాగదుర్గారావు.. చెల్లెలి కోసం మరోసారి తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. రాష్ట్రంలో న్యాయం దొరకడం లేదని, రిక్షాలో ఢిల్లీకి బయల్దేరాడు. సుప్రీంకోర్టు, హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించాడు. రిక్షాకు సీజేఐ ఎన్వీ రవణ ఫోటో కట్టి మరీ బయలుదేరాడు. గత నెల 27న దుర్గారావును డోర్నకల్ మండలం మన్నేగూడెం దగ్గర ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు రిక్షా యాత్రను మన్నేగూడెం నుంచే దుర్గారావు ప్రారంభించాడు. తన సోదరికి న్యాయం చేయాలని వేడుకుంటూ మే 23న తల్లి జ్యోతితో కలిసి దుర్గారావు ఢిల్లీ యాత్ర ప్రారంభించాడు.
దుర్గారావు.. తన సోదరి నవ్యతకు నరేంద్రనాథ్ తో 2018లో వివాహం చేశాడు. కట్నంగా రూ.23 లక్షల నగదు, 320 గ్రాముల బంగారం, 3 ఎకరాల పొలం ఇచ్చారు. పెళ్లి చేసుకున్న కొంత కాలం తర్వాత నరేంద్రనాథ్ ప్రవర్తన సక్రమంగా లేడని, పైగా అత్తింటివారు నవ్యతను బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకోవడంతో పాటు ఆమెను వేధింపులకు గురి చేశారు. వేధింపులు తట్టుకోలేక నవ్యత పుట్టింటికి వచ్చేసింది. ఘటన గురించి చందర్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. నవ్యత అత్తమామలు తమ పరపతి ఉపయోగించడంతో కేసులో ఎలాంటి పురోగతీ లేకపోయిందని దుర్గారావు వాపోయాడు. దీంతో విసిగిపోయి తన తల్లితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీకిపయనమైనట్లు వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి