విషాదం.. ఇదే ఆఖరయ్యేనా?

విషాదం.. ఇదే ఆఖరయ్యేనా?

-తప్పు చేసిందెవరు? శిక్ష పడుతుందెవరికి? -అమాయకుల ప్రాణాలు పోవడంలో ప్రభుత్వ బాధ్యత ఎంత? – పరిశ్రమ వస్తే చాలా? భద్రతకు ప్రాధాన్యత లేదా? -అభివృద్ధి అవసరమే కానీ.. వినాశనం కోరేది అవసరమా? ప్రకృతి అందాల పుట్టిల్లు. హోయలొలికే అలల తీరం. దేశవిదేశీ పర్యాటకులకు రెడ్‌ కార్పెట్‌ వెల్‌కం చెబుతుంది. అలాంటి ప్రకృతి ప్రేమికుల స్వర్గాదామం విశాఖ నగరం.. తెల్లవారుతూనే ఆర్తనాదాలతో మార్మోగింది. కెరటాల హోరును మించిన విషాద గీతం ఆలపించింది. సాగరతీరం ఒడ్డున ఉండే KGH… మృతుల […]

TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

May 12, 2020 | 8:14 AM


-తప్పు చేసిందెవరు? శిక్ష పడుతుందెవరికి?

-అమాయకుల ప్రాణాలు పోవడంలో ప్రభుత్వ బాధ్యత ఎంత?

– పరిశ్రమ వస్తే చాలా? భద్రతకు ప్రాధాన్యత లేదా?

-అభివృద్ధి అవసరమే కానీ.. వినాశనం కోరేది అవసరమా?

ప్రకృతి అందాల పుట్టిల్లు. హోయలొలికే అలల తీరం. దేశవిదేశీ పర్యాటకులకు రెడ్‌ కార్పెట్‌ వెల్‌కం చెబుతుంది. అలాంటి ప్రకృతి ప్రేమికుల స్వర్గాదామం విశాఖ నగరం.. తెల్లవారుతూనే ఆర్తనాదాలతో మార్మోగింది. కెరటాల హోరును మించిన విషాద గీతం ఆలపించింది. సాగరతీరం ఒడ్డున ఉండే KGH… మృతుల బంధువుల రోదనలతో శోకసంద్రంగా మారింది. నగర శివార్లలోని పరిశ్రమలో జరిగిన తప్పిదం ఈ విషాదానికి కారణమైంది. LG పాలిమర్స్‌ నుంచి వచ్చిన విషవాయువు కొందరి ఆయువు తీసింది. వందలాది కుటుంబాల్లో చీకట్లు నింపింది. ఇదొక్కటే కాదు.. పరిశ్రమల్లో ప్రమాదాలు, కాలుష్యం కారణంగా చనిపోతున్న సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. మరి వీటికి బాధ్యత వహించాల్సింది ఎవరు? యాజమాన్యాలు భద్రతా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు పర్యవేక్షించాలి. మరి ఎవరి పాత్రవాళ్లు పోషిస్తున్నారా.? ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తిస్తే ఇలాంటి దర్ఘటనలు మనం చేసే పరిస్థితి వస్తుందా… ఆలోచించాల్సిన సమయమిది.

 

పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రాణాలు పోతుంటాయి. కానీ ఇది కనీవినీ ఎరుగని పెను విషాదం. భోపాల్‌ గ్యాస్‌ లీక్‌ ఘటనతో పోల్చలేం కానీ… విశాఖ నగరానికి ఆనుకుని ఉన్న వెంకటాపురంలోని LG పాలిమర్స్‌ నుంచి వచ్చిన విషం 11 మంది పైగా ప్రాణాలను బలి తీసుకుంది. వేలాది మంది విషవాయువును పీల్చారు. వందల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మనకు ఓ పాఠం. పరిశ్రమలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అద్దం పడుతోంది. ఎమెర్జెన్సీ అలారం మోగకపోవడాన్ని సాక్షాత్తూ CM జగన్మోహన్‌ రెడ్డే ప్రస్తావించారంటే ప్యాక్టరీస్ యాక్ట్‌ను యాజమాన్యాలు ఎంత అలసత్వం ప్రదర్శిస్తున్నాయో అర్ధమవుతోంది.

వాస్తవానికి కెమికల్‌ పరిశ్రమలు పనిచేసినా.. చేయకపోయినా ఖచ్చితంగా నిర్వహణ ఉండాలి. అంతేకాదు.. ప్రమాదకరమైన ఉత్పత్తులు ఉంటే… సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీ యాక్ట్‌ స్పష్టం చేస్తోంది. అయినా ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే విశాఖ నగరం విషాదతీరంగా మారింది. ఇలాంటి ప్రమాదకరమైన వాయువులను సురక్షితమైన ప్రదేశంలో అండర్‌గ్రౌండ్‌లో నిల్వచేయాలి. లేదా అన్నిపరిస్థితులకు తట్టుకునే ఫైర్‌ రెసిస్ట్‌ స్టోరేజీ ట్యాంకులు ఏర్పాటు చేసుకోవాలి. వినియోగం తర్వాత మిగిలిన గ్యాస్‌ను స్పెషల్‌ ట్యాంకర్లలో నింపి జాగ్రత్త పరచాలి. లీకులు లేకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వినియోగంతో సంబంధం లేకుండా నిర్వహణ తప్పనిసరి. ప్రాపర్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్ జరగాలి. సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ ఖచ్చితంగా ఉండాలి. దీనిపై రాష్ట్రాలు కూడా రూల్స్‌ కఠినంగా ఫ్రేమ్‌ చేయవచ్చు. సేఫ్టీ ఇన్‌స్పెక్టర్‌ విధుల్లో ఉండాలి. ఎమెర్జెన్సీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డ్రాఫ్ట్‌ ఖచ్చితంగా పరిశ్రమలో ఉండాలి. దీనిని జిల్లా అధికారులకు, ప్రభుత్వానికి అందజేయాలి. ఎప్పటిప్పుడు పరిశ్రమలో వ్యర్ధాలు, లీకేజీలపై నివేదిక తయారుచేయాలి. ప్రజల నుంచి సమాచారం సేకరించాలి. చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి.. ఎమెర్జెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇవ్వాలి. ప్రతి మూడు నెలలకు కాలుష్య నియంత్రణ బోర్డు పర్యవేక్షించాలి.. NOC ఇవ్వాల్సి ఉంటుంది. ఆంబులెన్సులు, ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్లు అందుబాటులో ఉంచాలి. ప్రమాదాలు జరిగితే ఆటోమాటిక్‌గా అలారం సిస్టమ్‌ పనిచేయాలి. ఇవన్నీ ఏన్ని కంపెనీలు అనుసరిస్తున్నాయి. మార్గదర్శకాలకు పట్టించుకుంటున్నాయా? నిర్లక్ష్యం ఫలితమే విశాఖ ప్రమాదం. ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉత్పత్తితో సంబంధం నిర్వహణ జరగాలి. కానీ లాక్‌డౌన్‌ పేరుతో ఎవరూ లేరు. పట్టించుకోలేదు. దీంతో రసాయనం తనపని తాను చేసుకుంది. కంట్రోల్‌ తప్పి.. ప్రాణాలు తీసింది.

 

 

ఎల్జీ కంపెనీతో మాట్లాడామని.. కొరియా ప్రభుత్వాన్ని హెచ్చరించామని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి TV9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ లో చెప్పారు.

యూరోప్‌, కొరియా దేశాల్లో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ మేమూ ఇస్తామంటున్న మంత్రి… ఇదే విషయం కొరియా ప్రభుత్వానికి చెప్పామంటున్నారు. నిజంగా ప్రభుత్వాలు అలా ఉంటే మంచిదే.. కానీ ఆచరణలో చూపించాలి. ప్రమాదం జరిగింది కాబట్టి ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరి విషాదం జరగకపోతే పరిశ్రమల నిర్లక్ష్యం ప్రశ్నించే పరిస్థితి వచ్చేదా? దేశంలోని పారిశ్రామికవాడల్లో సేఫ్టీ స్టాండర్డ్స్‌ నిర్వహణలో మెజార్టీ కంపెనీలు అలసత్వమే ప్రదర్శిస్తున్నాయన్ని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇందుకు ఏ రాష్ట్రం మినహాయింపు కాదు. ప్రతి కంపెనీ ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌ ప్రకారం మార్గదర్శకాలు పాటించాలి. వ్యర్ధాల నిర్వహణ నుంచి ముడిసరుకు నిర్వహణ దాకా ప్రతిదానికి గైడ్‌లైన్స్‌ ఉన్నాయి. ప్రమాదం తలెత్తితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా సూచనలున్నాయి. కానీ ఇవేమీ విశాఖలో కనిపించలేదు. వ్యర్థాలను కూడా ట్రీట్‌మెంట్‌ చేయకుండానే అర్ధరాత్రి వదులుతున్న కంపెనీలెన్నో ఉన్నాయి మనదేశంలో. దీనివల్ల భూగర్బజలాలు కలుషితమవుతన్నాయని పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నా… . కంపెనీలు నిబంధనలు పాటిస్తున్నాయా? లేదా అన్నది చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. PCB వంటి ప్రత్యేక విభాగాలున్నాయి. సిబ్బంది లేరనో… పెద్దల నుంచి ఒత్తిళ్లు ఉన్నాయన్న సాకుతోనే చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారు.. ఫలితం అమాయక ప్రజల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. సేఫ్టీ అండ్‌ స్టాండర్స్డ్‌ విషయంలో అటు యాజమాన్యాలు.. ఇటు ప్రభుత్వాలు బాధ్యతలు వ్యవహరిస్తే ప్రమాదాలు నివారించే వచ్చు. లేదంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి.

దీనిపై బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ ప్రత్యేక లైవ్‌ షో జరిగింది… వీడియో కోసం ఈ కింద లింక్‌ క్లిక్‌ చేయండి.


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu