AP Elections: ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ల రచ్చ.. పెన్షన్ల పంపిణీ ఎన్నికల ఎజెండాగా మారుతుందా?
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ల అంశం రచ్చ రంబోలాగా మారుతోంది. పెన్షన్ల విషయంలో వాలంటీర్లను నియంత్రిస్తూ ఈసీ ఇచ్చిన ఆదేశాలు.. పొలిటికల్‌గా అగ్గిరాజేశాయి. పేదలపై కూటమి కుట్ర అంటూ పాలకపక్షం అంటుంటే... రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్షం మండిపడుతోంది. దీంతో, పెన్షన్ల పంపిణీ ఎన్నికల ఎజెండాగా మారుతున్నట్టు కనిపిస్తోంది.
ఏపీలో వాలంటీర్ల రచ్చ అంతకంతకూ ముదురుతోంది. ఎన్నికల కోడ్ ముగిసేవరకు.. వాలంటీర్లతో కాకుండా, ప్రత్యామ్నాయ మార్గాల్లో పెన్షన్ల పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించడం.. పొలిటికల్ వార్‌కు దారితీసింది. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. గతంలో మాదిరి ప్రజలు అవస్థలు పడాలన్నదే టీడీపీ అభిమతమనీ..అందుకే కుట్రతో వాలంటీర్లపై ఫిర్యాదు చేశారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. వైసీపీకి మంచిపేరు రావొద్దనే ఇలా చేశారని విమర్శిస్తున్నారు అధికార పార్టీ నేతలు.
అయితే, ఈసీ ఆదేశాలతో తమకేం సంబంధం అంటోంది టీడీపీ. వాలంటీర్లను రాజకీయ అవసరాలకు వాడుకోవద్దని మాత్రమే ఈసీ చెప్పిందనీ… పెన్షన్ల పంపిణీ ఆపాలని ఎక్కడా చెప్పలేదనీ స్పష్టం చేస్తున్నారు కూటమి నేతలు. అంతే కాదు, తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఈసీని కలిసి ఫిర్యాదు చేసింది టీడీపీ నేతల బృందం.
ఈ అంశంలో అధికార పార్టీ కుట్ర కనిపిస్తోందని ఆరోపించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కావాలనే పెన్షన్ల పంపిణీ ఆపి.. ఆ నెపాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తోందన్నారు. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందే ప్లాన్ చేస్తోందని విమర్శించారు షర్మిల.
మరోవైపు వైసీపికి మద్దతుగా చాలాచోట్ల వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తుండటం.. రాజకీయంగా మరిన్ని మంటలు రాజేస్తోంది. మెల్లమెల్లగా ఈ పెన్షన్ల అంశం.. ఎలక్షన్ ఎజెండాగా మారుతుండటంతో.. మున్ముందు ఈ ఎపిసోడ్ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..