Andhra Pradesh: అందుబాటులోకి వచ్చిన కొత్త వరి వంగడం.. ఎకరానికి ఆరు టన్నుల దిగుబడి

| Edited By: Surya Kala

Jul 20, 2023 | 7:14 PM

బ్లాక్ రైస్ లో అధిక పోషక విలువలు ఉండటమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుంది. షుగర్ రాకుండా ఉండాలంటే బ్లాక్ రైస్ తినాలని అందరూ అనుకుంటారు. దీంతో దేశీయంగానే బ్లాక్ రైస్ వరి వంగడాలను తయారు చేయాలని బాపట్ల వ్యవసాయ పరిశోధనా కేంద్రం సంకల్పించింది.

Andhra Pradesh: అందుబాటులోకి వచ్చిన కొత్త వరి వంగడం.. ఎకరానికి ఆరు టన్నుల దిగుబడి
Bpt 2841
Follow us on

నూతన వరి వంగడాలు అభివృద్ధి చేయడంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానాకి విశిష్ట స్థానం ఉంది.‌ అధిక దిగుబడులు ఇచ్చే బిపిటి సన్న బియ్యం వరి వంగడాన్ని ఇక్కడే అభివృద్ధి చేశారు. అయితే మారుతున్న కాలంతో పాటు ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహారాన్ని తీసుకునేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా షుగర్, క్యాన్సర్, గుండె సంబంధ రోగాలకు ఆహారపు అలవాట్లకు సంబంధం ఉంది. దీంతో తీసుకొనే ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి రోగాల నుండి దూరంగా ఉండవచ్చని ప్రజలు నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే బ్లాక్ రైస్ కు ప్రాధాన్యత పెరుగుతుంది. బర్మా, చైనా వంటి దేశాల్లో బ్లాక్ రైస్ ను విరివిగా ఉత్పత్తి చేస్తున్నారు. అయితే మన దేశంలో కూడా ఇటువంటి వరి వంగడాలను సాగు చేయడానికి రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల బ్లాక్ రైస్ ను రైతులు ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు.

బ్లాక్ రైస్ లో అధిక పోషక విలువలు ఉండటమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుంది. షుగర్ రాకుండా ఉండాలంటే బ్లాక్ రైస్ తినాలని అందరూ అనుకుంటారు. దీంతో దేశీయంగానే బ్లాక్ రైస్ వరి వంగడాలను తయారు చేయాలని బాపట్ల వ్యవసాయ పరిశోధనా కేంద్రం సంకల్పించింది. అనుకున్న విధంగానే బిపిటి 2841 రకాన్ని అభివృద్ధి చేసింది. ఎకరానికి ఆరు టన్నుల దిగుబడి ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ రకం సాగుచేయాలనుకునే రైతులు వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని సంప్రదించవచ్చు. అంతేకాకుండా అన్ని ఆర్బికేల్లోనూ ఈ రకం వంగడాలను అందుబాటులో ఉంచనున్నారు. అధిక దిగుబడి వస్తుందని అంతేకాకుండా ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతులకు లాభసాటిగా ఉంటుందంటున్నారు.

ఇవి కూడా చదవండి

బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం గతంలో అభివృద్ధి చేసిన బిపిటి బియ్యంలాగే ఈ బ్లాక్ రైస్ వరి వంగడం రైతులతో పాటు ప్రజల ఆదరణ చూరగొంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..