AP Rains: మరో అల్పపీడనం.. ఏపీలో దంచికొడుతోన్న వర్షాలు.. మరో వారం రోజులు ఇంతే!
వర్షాలు ఇకనుంచి మరింత దంచి కొడతాయా..? తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోనూ అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడుతున్నాయి.
వర్షాలు ఇకనుంచి మరింత దంచి కొడతాయా..? తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోనూ అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. వచ్చే వారం రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందా..? అంటే అవునని అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఎందుకంటే ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కాస్త బలపడే అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈనెల 26 కల్లా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి. వాతావరణ శాఖ కూడా ఇదే అంచనా వేస్తోంది.
ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీలో కాస్త వర్షపాతం తగ్గినప్పటికీ.. ఇకనుంచి మరింత పెరిగే సూచనలు ఉన్నాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఎందుకంటే ఉపరితల ఆవర్తనం కాస్తా బలపడి అల్పపీడనంగా మారింది. ఇది దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తా తీరాలకు ఆనుకొని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీనికి తోడు దక్షిణ ఛత్తీస్గడ్ పరిసర ప్రాంతాలపైన మరో ఆవర్తనం ఉంది. కోస్తా తీరానికి ఆనుకొని రుతుపవన ద్రోణి ఏర్పడింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో.. ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండు రోజుల్లో ఉత్తర కోస్తాలో చాలాచోట్ల, దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద.
26వ తేదీ కల్లా మరో అల్పపీడనం..!
రుతుపవనాలు యాక్టివ్‌గా మారడంతో.. సముద్రంలో కూడా అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారింది. ఇది దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తా తీరాలకు అనుకొని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. అయితే.. దీని వెనకే మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈనెల 26వ తేదీ కల్లా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి. భారత వాతావరణ శాఖ అధికారులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. అయితే 26వ తేదీకి అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా ఉన్నప్పటికీ.. రోజురోజుకు వాతావరణ పరిస్థితుల్లో మార్పు నేపథ్యంలో.. అప్పటి పరిస్థితిని బట్టి ఏర్పడబోయే అల్పపీడనం ఏ మేర ప్రభావం చూపుతుందనే విషయంపై ప్రకటిస్తామని అంటున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద. అల్పపీడనంలో నేపథ్యంలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు అధికారులు.
ఏఓబిలో వరద ఉధృతి..
ఉత్తరకోస్తాలోని అల్లూరి జిల్లాతో పాటు పార్వతీపురం, దక్షిణ కోస్తాలోని కొన్ని చోట్ల వర్షాలు కురిసాయి. ఒడిస్సాలో కురిసిన వర్షానికి ఆంధ్రా ఒడిస్సా సరిహద్దులో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మల్కనగిరి జిల్లా పొట్టేరులో వంతెన పైనుంచి భారీగా వరద నీరు ప్రవహించింది. దీంతో నిన్న వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఏఓబిలో మరికొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉండడంతో ఆంధ్ర, చత్తీస్గడ్ తెలంగాణ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఉదయం వరద తగ్గుముఖం పడటంతో.. వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
అల్లూరి ఏజెన్సీలో దంచి కొట్టిన వాన..!
అల్లూరి ఏజెన్సీలోని జిమాడుగుల ముంచంగిపుట్టు పెదబయలు మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదు అవుతుంది. నిన్న ముంచంగిపుట్టులో 9 సెంటీమీటర్లు, జి మాడుగుల పాడేరు చింతూరులో ఏడేసి సెంటీమీటర్లు, జీకే వీధిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
కొట్టుకుపోయిన వంతెన.. మారుమూల ప్రాంతాలకు రాకపోకలు బంద్..
అల్లూరి జిల్లా ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు పొంగిపొర్లుతున్నయి వాగులు, గెడ్డలు. జి మాడుగుల మండలం బొయితిలిలో వరద ఉధృతికి వాగుపై వంతెన కొట్టుకుపోయింది. పెదబయలు, ముంచంగి పుట్టు, జి మాడుగుల మండలాల్లో ప్రమాద స్థాయికి చేరుకున్నయి వాగులు. దీంతో.. మారుమూల గ్రామాలకు రవాణా నిలిచిపోయింది.