AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: కోట్లు కురిపిస్తున్న ఆత్రేయపురం పూతరేకులు.. దసరాతో జోరందుకున్న అమ్మకాలు

నోరూరించే ఆత్రేయపురం పూతరేకులకు భారీగా డిమాండ్ పెరిగింది. దసరా ఉత్సవాల సందర్భంగా పూతరేకుల అమ్మకాలు మరింత పెరిగాయి. ఇటీవల కాలంలో కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న ఆలయానికి భక్తుల రాక పెరగడంతో.. ఆత్రేయపురం పూతరేకుల అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. దీంతో పూతరేకుల తయారీ కేంద్రాల వద్ద ప్రత్యేక సందడి నెలకొంది.

Andhra News: కోట్లు కురిపిస్తున్న ఆత్రేయపురం పూతరేకులు.. దసరాతో జోరందుకున్న అమ్మకాలు
Andhra News
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Sep 28, 2025 | 4:38 PM

Share

అంబేద్కర్ కోనసీమ జిల్లా అనగానే కేరళను తలపించేలా పచ్చని కొబ్బరి తోటలు.. కట్టిపడేసే ప్రకృతి రమణీయ దృశ్యాలయిన వరి పొలాలు.. పచ్చని ప్రకృతి గుర్తొస్తాయి.. ఇవన్ని ఈ ప్రాంతానికి సహజ సౌందర్యంగా ప్రత్యేక అందాన్ని అందిస్తుంటే.. మరో పక్క ఆత్రేయపురం పూతరేకులు మాత్రం దేశ, విదేశాల ప్రజలకు నోరూరించే రుచుల పసందును, కమ్మటి వాసనను అందిస్తున్నాయి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే ఈ పూతరేకులు అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. దసరా ఉత్సవాలు.. దసరా సెలవులు నేపథ్యంలో ఆత్రేయపురంలోని పూతరేకుల తయారీ కేంద్రాల వద్ద అమ్మకాలు పెరిగి ప్రత్యేక సందడి నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు తాకిడి పెరగడం, నిత్యం వచ్చే వేలాది మంది భక్తులు మార్గం మధ్యలోని ఈ ఆత్రేయపురంలో పూతరేకులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుండడంతో ఈ వ్యాపారం మరింత దూసుకుపోతుంది.

పండుగల వేళ పెరుగుతున్న వ్యాపారం.

ఏ పండుగలు వచ్చినా ఆత్రేయపురం పూతరేకుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరిగా సాగుతోంది. 20 ఏళ్ల క్రితం వరకు ఇంటింటా.. ఊరూరా.. తిరిగి అమ్మకాలు జరిపే స్థాయి నుంచి ఆన్లైన్ వ్యాపారం వరకు ఈ పూతరేకుల అమ్మకాలు దినదినాభివృద్ధి చెందాయి. మండల స్థాయి నుంచి జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, విదేశాలకు నోరూరించే ఆత్రేయపురం పూతరేకుల వ్యాపారం చేరింది. సాధారణ రోజుల్లో మంచి వ్యాపారమే చేస్తున్నప్పటికీ పండుగ రోజుల్లో మాత్రం ఈ వ్యాపారం దూసుకుపోతూ ఏడాదికి సుమారుగా రూ.6 కోట్ల వ్యాపారం జరుగుతుందంటే ఆత్రేయపురం పూతరేకుల ప్రత్యేకత ఏమిటో ఇట్టే తెలుస్తుంది.

విభిన్నతతో దూసుకుపోతూ.

మొదట్లో పూతరేకులు అంటే బియ్యపు పిండితో తీసిన పూతరేకులను పంచదార, బెల్లం మాత్రమే ఉపయోగించి తయారు చేసేవారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఆత్రేయపురం పూతరేకులు తయారీలో జనరేషన్ మారే కొలది విభిన్నతను చాటుకుంటూ పూతరేకుల ప్రియుల ఇష్టాలకు అనుగుణంగా కొత్త పుంతలు దిద్దుకున్నాయి. షుగర్ ఉన్నవారు తినేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా షుగర్ ఫ్రీ పౌడర్ తోను వీటిని తయారు చేస్తున్నారు. చిన్నపిల్లలు ఇష్టంగా తినేందుకు చాక్లెట్ పూతరేకులు, ఐస్ క్రీమ్ పూతరేకులు, అన్ని వయసుల వారు ఇష్టంగా తినేందుకు డ్రై ఫ్రూట్స్, కారంపొడి, హార్లిక్స్, తేనె, కోవా జోడించి విభిన్న రుచులతో చుట్టిన పూతరేకులను అందిస్తున్నారు.

50 వేల మంది వరకు ఉపాధి

ఆత్రేయపురం పూతరేకులు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చేరుతున్నాయి. అలాగే దుబాయ్, అమెరికా, జర్మనీ, సింగపూర్, మలేషియా తో పాటు ప్రపంచంలోని మరికొన్ని దేశాలకు కూడా వీటిని ఎగుమని చేస్తున్నారు.  ఈ క్రమంలో ఆత్రేయపురంతో పాటు చుట్టుపక్కల 20 గ్రామాల్లోని 50 వేల వరకు ప్రజలు పూతరేకులు తయారీ, అమ్మకాల ద్వారా ఉపాధి పొందుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.