Arnab Cyclone Update: ఏపీలో అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. వచ్చే మూడు రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..?
ఏపీలో అతి తీవ్ర తుఫాన్ అర్నబ్ బీభత్సం సృష్టించనుంది. రేపే తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే ఈదురుగాలులు అత్యంత వేగంగా వీయనుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అత్యంత తీవ్ర తుఫాను “అర్నాబ్” గత 6 గంటలుగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా పయనించింది. అక్టోబర్ 27, 2026న ఉదయం 08:30 గంటల సమయానికి ఇది 16.0° ఉత్తర అక్షాంశం, 84.3° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది విశాఖపట్నంకు దక్షిణ-ఆగ్నేయంగా 220 కి.మీ, కాకినాడకు తూర్పు-ఆగ్నేయంగా 240 కి.మీ, మచిలీపట్నంకు తూర్పు-ఆగ్నేయంగా 340 కి.మీ, గోపాల్‌పూర్ (ఒడిశా)కు దక్షిణంగా 370 కి.మీ, బాపట్లకు తూర్పున 410 కి.మీ మరియు శ్రీ విజయ పురం (అండమాన్ దీవులు)కు పశ్చిమ-వాయవ్యంగా 1030 కి.మీ దూరంలో ఉంది. ఇది అక్టోబర్ 27 సాయంత్రం వరకు పశ్చిమ-వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది వాయవ్య దిశగా ప్రయాణించి అక్టోబర్ 28, 2026 ఉదయానికి బాపట్ల, విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. అప్పుడు ఇది అత్యంత తీవ్ర తుపానుగా ఉండి గంటకు 125-135 కి.మీ వేగంతో (గరిష్టంగా 150 కి.మీ వేగంతో పెను గాలులతో) వీచే అవకాశం ఉంది. అటు నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరం నుండి అత్యంత తీవ్ర తుపాను “అర్నాబ్” కేంద్రం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. ఇది సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోంది. ఇక నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది పైన పేర్కొన్న ద్రోణితో కలిసిపోయింది.
వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు అమరావతి వాతావరణ కేంద్రం జారీ చేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు కొన్ని చోట్ల సంభవించే అవకాశముంది. పెను గాలులు గంటకు 90-100 కిలోమీటర్లు గరిష్టముగా 110 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వాాతావరణశాఖ హెచ్చరించింది. ఇక రాయలసీమలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల గరిష్టముగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని స్పష్టం చేసింది.
తెలంగాణ వాతావరణం అప్డేట్..
అర్నబ్ తుఫాన్ ప్రభావం ఏపీపై ఎక్కువగా ఉండగా… దీని ప్రభావం తెలంగాణపై కూడా స్వల్పంగా ఉంటుంది. రాబోయే మూడ్రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశంముంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
