AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిండి లేకుండా 35 రోజులు గడిపా.. ఆత్మహత్య చేసుకుందామనుకున్నా : రాజేంద్రప్రసాద్

తెలుగు సినీ పరిశ్రమలో తన విలక్షణ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నవరస నటనా సార్వభౌమ రాజేంద్ర ప్రసాద్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, యువతారలతో అనుబంధం, తనను తీర్చిదిద్దిన కీలకమైన పాఠాల గురించి ఆయన పలు విషయాలు వెల్లడించారు.

తిండి లేకుండా 35 రోజులు గడిపా.. ఆత్మహత్య చేసుకుందామనుకున్నా : రాజేంద్రప్రసాద్
Rajendra Prasad
Rajeev Rayala
|

Updated on: Oct 27, 2026 | 12:42 PM

Share

ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న అపూర్వమైన కష్టాలను, వ్యక్తిగత పోరాటాలను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో పంచుకున్నారు. ఆయన మాటల్లో, ఆ రోజుల్లో తాను పడిన కష్టాలు అంతా ఇంతా కాదని, అవి తనను ఆత్మహత్య ఆలోచనల వరకు తీసుకెళ్లాయని తెలిపారు. అప్పటికి తాను సినిమాలకు సిద్ధంగా లేనని, సన్నగా ఉండేవారని, గ్లామర్ లేదని, అపరిణతి చెందిన వ్యక్తిగా తనను తాను అభివర్ణించుకున్నారు. రామారావు గారి ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత, సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ రోజులు గడిపినట్లు పేర్కొన్నారు. తండ్రిగారు “నువ్వు ఎంచుకున్న బాట అది, తిరిగి రావడానికి లేదు” అని కచ్చితంగా చెప్పడంతో, ఆయనకు వేరే దారి లేకుండా పోయింది. ఈ నిస్సహాయ స్థితిలో, సుమారు 30-35 రోజుల పాటు సరైన భోజనం లేక కేవలం ఒక అరటిపండు, ఒక గ్లాసు మజ్జిగతో జీవనం సాగించినట్లు రాజేంద్ర ప్రసాద్ వివరించారు. చిల్లర డబ్బులను జాగ్రత్తగా వాడుకుంటూ, ఎంతకాలం వస్తుందో లెక్కలు వేసుకుంటూ రోజులు గడిపారు. ఈ తీవ్రమైన ఆకలి, నిస్సహాయత ఆయన్ను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనల వైపు నెట్టివేశాయి. “ఇంటికి వెళ్ళలేము, ఇంకో మార్గం లేదు” అనుకొని, చివరి ప్రయత్నంగా పెద్దాయన, ఎన్టీఆర్, పుండరీకాక్షయ్య గారిని కలవడానికి వెళ్ళానని చెప్పారు.

అదృష్టవశాత్తూ, ఎన్టీఆర్ గారు ఇంటి వద్ద లేకపోవడంతో, పుండరీకాక్షయ్య గారి ఇంటికి వెళ్లేసరికి అక్కడ పెద్ద చర్చ జరుగుతోందని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. పుండరీకాక్షయ్య గారు నిర్మించిన మేలుకొలుపు సినిమాలోని 14-15 ఏళ్ల హీరో రాజా కృష్ణ పాత్రకు వాయిస్ సరిపోవడం లేదని, పెద్ద వాయిస్ ఎక్కువ అవుతోందని, ఆడవాయిస్ ఫెమినిన్ గా ఉందని లోపల విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ ఆకలితో, నిస్సత్తువతో బయట వేచి చూస్తూ ఉన్నారట. ఆ చర్చల అనంతరం పుండరీకాక్షయ్య గారు బయటికి వచ్చి, రాజేంద్ర ప్రసాద్‌ను చూసి “అబ్బో, ప్రసాద్ ఉన్నాడు కదా, మర్చిపోయాను” అని ఆనందపడి, తనను వెంటనే కార్ ఎక్కించుకొని డబ్బింగ్ థియేటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ మైక్ ముందు నిలబెట్టి, డైలాగులు చదవమని చెప్పారు. ఆకలితో ఉన్నప్పటికీ, గోల్డ్ మెడలిస్ట్ స్థాయిలో శిక్షణ పొందిన రాజేంద్ర ప్రసాద్ వెంటనే డబ్బింగ్ చెప్పేశారట. ఆయన వాయిస్ విన్న చిత్ర బృందం ఎంతో సంతోషించింది, “నెల రోజులుగా వాయిస్ దొరకక చచ్చిపోతున్నాం, ప్రసాద్ నువ్వే మాకు దొరికావు. ఇప్పుడు మొత్తం డబ్బింగ్ నువ్వే చెప్పాలి” అన్నారు.

అందుకు రాజేంద్ర ప్రసాద్, “నాకు ఒక్క భోజనం పెట్టించండి, నేను చెప్తాను” అని కోరారు. ఆయన ఆకలిని అర్థం చేసుకున్న చిత్ర బృందం, ఆయనపై చూపిన ప్రేమను రాజేంద్ర ప్రసాద్ గుర్తుచేసుకున్నారు. ఆ డబ్బింగ్ అవకాశంతో ఆయనకు భోజనం మాత్రమే కాకుండా, అనేక డబ్బింగ్ అవకాశాలు వెల్లువెత్తాయి. కేవలం డబ్బింగ్ ద్వారా మద్రాస్‌లో ఇల్లు కట్టేంత డబ్బు సంపాదించానని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇది దైవ పరీక్షల తర్వాత లభించిన గొప్ప ఉపశమనంగా ఆయన అన్నారు. జీవితం కష్టాలను ఇస్తుందని, కానీ వాటి నుండి బయటపడటానికి మార్గాలను కూడా చూపిస్తుందని ఇది నిదర్శనమని రాజేంద్రప్రసాద్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us