Fact Check: గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఆంధ్రపదేశ్ ఆర్టీసీ బస్సు కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు.. పూర్తి స్థాయిలో వర్షం నుంచి రక్షణ కల్పించే విధంగా ఒక ప్లాస్టిక్ టర్బన్ తో కవర్ చేసి ఉంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ.. రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 300 తాటాకు, 30 కట్టల గడ్డి తెచ్చి కూడా బస్సులపై సుబ్బరంగా కప్పేలా ఉన్నారు అంటూ.. సెటైర్స్ వేస్తూ.. ఆ ఫోటోని షేర్ చేస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ దుస్థితికి ఇదో తార్కాణమంటూ ఏపీ సర్కారుపై కూడా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఈడీ అధికారి స్పందించారు.
తాజాగా వైరల్ అవుతున్న ఫోటో పై విజయవాడ ఆర్టీసీ ఈడి వెంకటేశ్వర రావు వివరణ ఇచ్చారు. సోషల్ మీడియా లో నిన్నటి నుంచి ఆర్టీసీ బస్సు కు సంబంధించిన ఒక నెగిటివ్ న్యూస్ ప్రచారం అవుతుందని తెలిపారు. బస్సులో ప్రయాణీకులు తడవకుండా టార్పాలిన్ కప్పామని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. ఆర్టీసీ బస్సుల్లో తాము ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు సరఫరా చేస్తున్నామని తెలిపారు. జులై 4 లోపు ప్రతి ప్రభుత్వ పాఠశాలకు పుస్తకాలను సరఫరా చెయ్యాల్సి ఉన్నందున.. కొన్ని పుస్తకాల తరలింపుకు బస్సులను ఎంచుకున్నామని వెంకటేశ్వర రావు చెప్పారు. ఈ నేపథ్యంలో తగిన రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే కోనసీమ జిల్లాకు ఇప్పటి వరకు 64 లక్షల పుస్తకాలు రవాణా చేశామని తెలిపారు. అయితే అసలు విషయం తెలుసుకోకుండా.. సోషల్ మీడియా వేదికగా ఆర్టీసీ కి సంబంధించి అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తే.. న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆర్టీసీ ఈడి వెంకటేశ్వర రావు.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..