Andhra Pradesh: ఓర్నీ.. ఏపీలో మద్యం షాపుల కోసం అమెరికా నుంచి కూడా అప్లికేషన్స్

కొత్త ప్రభుత్వం. కొత్త పాలసీ. మద్యం షాపు లకోసం అప్లికేషన్లు షాంపైన్‌లా పొంగుతున్నాయి. నాన్‌ రిఫండబుల్‌ ఫీజ్‌ రూపంలో సర్కారు ఖజానాకి ఇప్పటికే వందల కోట్ల ఆదాయం వచ్చేసింది. గడువు పెంపుతో రెండ్రోజుల్లోనే వెల్లువలా వచ్చిపడ్డాయ్‌ దరఖాస్తులు. ఫారిన్‌ నుంచి కూడా లిక్కర్‌ టెండర్లు ఈసారి సమ్‌థింగ్‌ స్పెషల్‌.

Andhra Pradesh: ఓర్నీ.. ఏపీలో మద్యం షాపుల కోసం అమెరికా నుంచి కూడా అప్లికేషన్స్
Andhra Liquor Shops
Follow us

|

Updated on: Oct 11, 2024 | 1:05 PM

గంటగంటకీ అంకె మారిపోతోంది. ఏపీలో మద్యం షాపులకోసం దరఖాస్తుల ప్రవాహం ముంచెత్తుతోంది. ఒక్కో దరఖాస్తుకు 2లక్షల చొప్పున ఆదాయం ఖజానాకొచ్చి చేరుతోంది. రెండ్రోజులు గడువు పెంచి అక్టోబరు 11 వరకు అవకాశం ఇవ్వటంతో.. మద్యం షాపులకు టెండర్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. టెండర్లకు తటపటాయిస్తున్నవారు కూడా గడువుపెంపు ప్రకటన తర్వాత సై అంటూ ముందుకొచ్చారు. నేరుగా దరఖాస్తులు సమర్పించడం ఇబ్బందనుకున్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. శుక్రవారం సాయంత్రం 7గంటలదాకా దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.

అక్టోబరు 12, 13 తేదీల్లో దరఖాస్తులు పరిశీలించి.. 14న కలెక్టర్ల పర్యవేక్షణలో లాటరీ తీసి మద్యం షాపులు కేటాయిస్తారు. అక్టోబరు 16వ నుంచి కొత్త మద్యం పాలసీ ప్రకారం ఏపీలో ప్రైవేటు మద్యం షాపులు నడవనున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకొచ్చాక ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించింది. ఏపీలో అధికారం మారాక కూటమి ప్రభుత్వం మద్యం పాలసీకి సంబంధించిన జీవోను సవరించి తెలంగాణ తరహాలో విధానాన్నే అమల్లోకి తీసుకొస్తోంది. ముందు నిర్ణయించిన గడువులోపు దరఖాస్తులు అంతగా రాకపోవడం, సిండికేట్లపై కొన్ని ఆరోపణలు రావటంతో దరఖాస్తు గడువును మరో రెండు రోజులు పొడిగించింది. దీంతో మరో రోజు గడువు మిగిలి ఉండగానే దాదాపు 70వేలకి పైగా దరఖాస్తులు అందాయి.  దుకాణాల లైసెన్సుల కోసం గురువారం రాత్రి 8 గంటల వరకూ 65,629 అప్లికేషన్స్ అందాయి. ఇందులో గురువారం ఒక్కరోజే 7,920 అప్లికేషన్స్ వచ్చాయి. నాన్‌ రిఫండబుల్‌ రుసుముల రూపంలో సర్కారుకు రూ.1,312.58 కోట్ల ఆదాయం సమకూరింది. శుక్రవారం చివరి రోజు కావటంతో 20 వేలకు పైగా అప్లికేషన్స్ వస్తాయని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం దరఖాస్తుల సంఖ్య 80 వేలు దాటే చాన్సులు ఉన్నాయి.

వైసీపీ హయాంలో లిక్కర్‌పాలసీని కూటమి ప్రభుత్వం తప్పుపట్టింది. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో కొత్తపాలసీని తెరపైకి తెచ్చింది. అయితే దరఖాస్తుల విషయంలో కొన్నిచోట్ల ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలతో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. మద్యం టెండర్లలో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని పార్టీ నేతలకు సంకేతాలిచ్చింది. దీంతో కొన్ని చోట్ల సిండికేట్లు తమ వ్యూహాన్ని మార్చుకున్నా.. మరికొన్ని చోట్ల నేతల జోక్యం తగ్గిందన్న మాట వినిపిస్తోంది. ఈసారి విదేశాలనుంచి కూడా కొందరు మద్యం టెండర్లు వేయడం ఆసక్తికర పరిణామం. లిక్కర్ షాపుల కోసం అమెరికా నుంచి 20 అప్లికేషన్స్ వచ్చాయని ఏపీ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి తెలిపారు.

కొన్నిచోట్ల సిండికేట్ల ప్రభావంపై మొదట ఆరోపణలొచ్చినా ప్రభుత్వం గడువు పెంచటంతో ఇతరులు కూడా టెండర్లలో పోటీపడుతున్నారు. మొత్తానికి ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో గడువు ముగిసేలోపు దరఖాస్తులు అంచనాలకు మించిపోయేలా ఉన్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..