ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా వాతావరణం చల్లబడింది. ఓవైపు తీవ్రమైన చలితో ప్రజలు వణికిపోతుంటే.. మరోవైపు వర్ష సూచనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా అమరావతి వాతావరణ కేంద్రం మరో హెచ్చరిక జారీ చేసింది. రానున్న మూడు రోజులకు సంబంధించి రాష్ట్ర వాతావరణ నివేదికను విడుదల చేసిన వాతావరణ శాఖ.. ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మరికొన్ని చోట్ల తీవ్రమైన చలి ఉంటుంది. అమరవాతి వాతరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానాం లలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. దీని కారణంగా ఆయా ప్రాంతాల్లో తీవ్రమైన చలి ఉంటుంది. మరొకొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయి.
ఉత్తరకోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉంటుంది. ఇక దక్షిణ కోస్తాంధ్రాలో ఇవాళ, రేపు పొడి వాతావరణం ఉంటుంది. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్రమైన చలిగాలులు వీస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు.
రాయలసీమ ప్రాంతంలో ఇవాళ, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..