AP Gvt Primary Schools: ఏపీలో వరుసగా మూతపడుతోన్న సర్కార్ బడులు.. కారణం ఇదే!

రాష్ట్రంలో పలు చోట్ల పల్లెబడులను జగన్‌ సర్కార్ మూసేసింది. 2023-24 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గడమే అందుకు కారణం. దీంతో మూడో తరగతి, నాలుగో తరగతి, ఐదో తరగతులను..

AP Gvt Primary Schools: ఏపీలో వరుసగా మూతపడుతోన్న సర్కార్ బడులు.. కారణం ఇదే!
CM Jagan

Updated on: Jul 24, 2023 | 1:29 PM

అమరావతి, జులై 24: రాష్ట్రంలో పలు చోట్ల పల్లెబడులను జగన్‌ సర్కార్ మూసేసింది. 2023-24 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గడమే అందుకు కారణం. దీంతో మూడో తరగతి, నాలుగో తరగతి, ఐదో తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. 1, 2 తరగతుల్లో విద్యార్థుల చేరికలు తగ్గాయి. గతేడాది పదిమంది లోపు విద్యార్థులున్న బడుల్లో ఈ ఏడాది ఒక్కరూ చేరలేదు. ఉన్నవారు వేరే పాఠశాలలకు వెళ్లిపోవడంతో విద్యార్థులు లేరంటూ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 118 ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం మూసేసింది. మరో 50 ఎయిడెడ్‌ పాఠశాలలకూ ఇదే దుస్థితి. తరగతుల విలీనాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులతోపాటు 70 మంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు సైతం వ్యతిరేకిస్తూ విద్యాశాఖ మంత్రి బొత్సకు లేఖలు రాశారు. కొన్నింటిని మినహాయించి మిగతావన్నీ విలీనం చేసేశారు.

ప్రపంచబ్యాంకు రుణం కోసం మానవవనరుల వ్యయాన్ని తగ్గించుకుంటామన్న నిబంధనలో భాగంగా ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించుకునేందుకు పాఠశాలలను మూసేస్తున్నారు. విద్యాహక్కు చట్టానికి సైతం సవరణ చేసి కిలోమీటరు దూరంలో ఉండాల్సిన 3,4,5 తరగతులను మూడు కిలోమీటర్ల దూరం వరకు ఉండేలా సవరించారు. అంగన్‌వాడీ కేంద్రాలనూ కిలోమీటరు దూరంలో ఉండొచ్చని సవరించేశారు. దూరాబారం వెళ్లలేక విద్యార్ధులు సగంలోనే చదువు మానేస్తున్నరు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,73,416 మంది విద్యార్థులు చదువు మధ్యలోనే మానేశారు. వీరిలో వలసల కారణంగా 49,099 మంది విద్యార్ధులు బడి మానేసి ఇళ్ల వద్ద ఉంటున్నారు.

నాడు మూతపడితే నాదే బాధ్యతన్న సీఎం జగన్‌

జాతీయ విద్యావిధానంలో భాగంగా రాష్ట్రంలో పాఠశాలల విలీనాన్ని చేపట్టామని, ఈ ప్రక్రియలో ఎక్కడైనా ఒక్క పాఠశాల మూతపడినా నాదే బాధ్యత అని 2022 జూన్‌ 28న అమ్మఒడి నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్‌ అన్నారు. కేవలం ఒకే ఒక్క హైస్కూలు విద్యార్థిని కోసం జపాన్‌లోని హక్వైడో ఉత్తర ద్వీపంలోని కమీ షిరాటకి రైల్వేస్టేషన్‌ మీదుగా రోజుకు రెండుసార్లు రైలు నడిపింది అక్కడి ప్రభుత్వం. ఒక్క విద్యార్ధి కోసం మూడేళ్లు ఇలాగే కొనసాగించారు. వారితో పోల్చితే ఏపీ సర్కార్‌ విద్యకు ఇచ్చే ప్రాధాన్య ఏపాటితో తెలుస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.