అమరావతి, జులై 20: రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2023-29 విద్యాసంవత్సారానికి సంబంధించి ఆరేళ్ల బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నేటి నుంచి కౌన్సెలింగ్ జరగనుంది. జులై 20 నుంచి 25 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు బుధవారం (జులై 19) ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి మొత్తం 4,400 సీట్లు ఉన్నాయి. ప్రత్యేక కేటగిరీ సీట్లు మినహాయించి మిగిలిన 4,040 సీట్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 13న ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరందరికీ నేటి నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ఆయా తేదీల్లో విద్యార్ధులు ఉదయం 8 గంటలకు ఆయ సెంటర్లకు హాజరు కావాలని ఆయన సూచించారు. పదో తరగతికి సంబంధించి అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికెట్లను వెంట తెచ్చుకోవాలని తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం సీటును కేటాయిస్తారు. అడ్మిషన్ ఫీజు ఇతర ఫీజులు కలిపి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.3,700, ఇతర కేటగిరీల విద్యార్థులు రూ.4,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని కన్వినర్ గోపాలరాజు పేర్కొన్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.