AP Police Arrest Pattabhi: సీఎం జగన్‌పై.. తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయం, పట్టాభి ఇంటిపై దాడి చేశారు. అనంతరం రాష్ట్రంలో పరిస్థితులు రణరంగంగా మారాయి. రాజకీయ ఆజ్యానికి కారణమైన టీడీపీ నేత పట్టాభిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా గొడవలకు కారణమైన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పోలీసులు పట్టాభి ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు పగులగొట్టి పోలీసులు పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య పట్టాభిని ఇంటి దగ్గరి నుంచి గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో పట్టాభిపై సెక్షన్ 153ఏ, 505 (2), 505 (r/w), 120బి కింద కేసు నమోదు చేశారు.
కాగా.. పట్టాభి అరెస్టు అనంతరం ఆయన భార్య చందన మీడియాతో మాట్లాడారు. ఎఫ్ఐఆర్ కాపీ చూపెట్టకుండా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఆయనకు ఎం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటూ ఆమె పేర్కొన్నారు. పట్టాభిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పలేదని తెలిపారు. తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని.. దీనిపై కోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. పట్టాభి అరెస్టుకు సాయంత్రం నుంచే రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో పట్టాభి ఇంటి వద్దకు పోలీసులను భారీగా మోహరించారు. పోలీసులు పట్టాభిని అరెస్టు చేస్తున్నారన్న ఊహాగానాలతో టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా పట్టాభి ఇంటికి చేరుకున్నారు. దీంతో పట్టాభి ఇంటి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.