Andhra Pradesh: విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చాలని వైసీపీ ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ శాసనసభలో స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి.. పేపర్లు విసిరి నిరసన తెలిపారు. దీంతో టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అయితే ప్రభుత్వ తీరుకు నిరసనగా అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీ నామా చేశారు. తనకు హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం లాంటి కీలక పదవులు ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గౌరవించారని, అయితే ఎన్ టి ఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం పై తాను చాలా బాధపడుతున్నట్లు తెలిపారు. వైఎస్సార్ పేరు పెట్టడం పట్ల అభ్యంతరం లేదు కానీ ఎన్ టి ఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదన్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు వైఎస్సార్ ముఖ్యమంత్రి గా ఉన్నారని, ఆ సమయంలో సహాయం కోసం తాను వైఎస్సార్ దగ్గరకు వెళ్తే సహాయం చేశారన్నారు. ఆ కేసులో తనపై ఒత్తిడి వచ్చినా వైఎస్సార్ లొంగలేదని యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రాబునాయుడు పై తనది సైద్ధాంతిక విరోధమే తప్ప వేరే ఏమీ లేదని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ ను చంద్రబాబు వ్యతిరేకించేవారు: ఎన్డీఆర్ పై చంద్రబాబుకు ఎటువంటి అభిమానం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు యార్లగడ్డ లక్ష్మిప్రసాద్. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకుంటున్నారంటూ NTRకు భారత రత్న ఇస్తానని అప్పటి ప్రధాని వాజ్ పేయి చెప్తే చంద్రబాబు వద్దన్నారని.. దానికి తానే సాక్ష్యమని చెప్పారు. ఆ క్రెడిట్ లక్ష్మీ పార్వతి కి వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు వద్దన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బేగంపేట విమానాశ్రయానికి NTR పేరు పెట్టడానికి గతంలో కేంద్రప్రభుత్వం ఆసక్తి చూపించినా చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని విమర్శించారు.
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పొరపాటు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన యార్లగడ్డ లక్ష్మిప్రసాద్, వైఎస్.జగన్మోహన్ రెడ్డి తీరును తప్పుబట్టారు. జగన్ తన దృష్టిలో హీరో అని అంటూనే విజయవాడలో ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ పేరు పెట్టడం పొరపాటని అన్నారు. జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి తనను చాలా గౌరవించారన్నారు. ఎన్డీఆర్ యూనివర్సిటీకి పేరు మార్పుపై మనస్తాపం తో తాను అధికార భాషా సంఘం అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న పేరు మార్పు నిర్ణయంతో రాజశేఖర్ రెడ్డి ఆత్మ కూడా శాంతించదని తెలిపారు. తాను జగన్ తోనే ఉంటానని స్పష్టంచేశారు.
ఎన్టీఆర్ ఇళ్లను అమ్మేసింది చంద్రబాబే: మద్రాస్, హైదరాబాద్ అబిడ్స్ లో ఎన్ టి ఆర్ నివాస గృహాలను నిర్లక్ష్యం చేసి అమ్మివేసింది చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్ లో ఎన్ టి ఆర్ చనిపోయిన గృహాన్ని పడేసి అపార్ట్మెంట్ లు కట్టడం కన్నా విషాదం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. NTR కి చంద్రబాబు చేసినంత ద్రోహం ఎవరూ చేయలేదన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..