నంద్యాల జిల్లా రాజకీయ సంచలనం జరిగింది. ప్యాపిలిలో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహాన్ని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆవిష్కరించడం సంచలనంగా మారింది. వాస్తవంగా ప్యాపిలిలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించాలని 12 ఏళ్ల క్రితమే కమతం భాస్కర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు కోట్ల విగ్రహం ఆవిష్కరణకు నోచుకోలేదు. విగ్రహానికి బట్ట చుట్టి మూసేశారు. ప్రస్తుత ఎన్నికలవేళ విగ్రహం గురించి చర్చ జరిగింది.
ప్రస్తుతం డోన్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి తెలుగు దేశం పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు. అతనికి పోటీగా రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ తరఫున తలపడుతున్నారు. వాస్తవంగా సూర్య ప్రకాష్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే విగ్రహ ఏర్పాటు చేశారు. ఎందుకో కానీ ఇప్పటివరకు ఆవిష్కరణకు నోచుకోలేదు. అయితే తాజాగా తనతో అసెంబ్లీ ఎన్నికల్లో తలపడపోతున్న ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అయిన కోట్ల సూర్య ప్రకాష్ తండ్రి విగ్రహాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ ఆవిష్కరించడం రాజకీయంగా సంచలనం అయింది.
బుగ్గన విగ్రహాన్ని ఆవిష్కరించగానే కోట్ల అమర్ హై అంటూ ఆయన అనుచరులు నినాదాలు చేశారు. కొబ్బరికాయలు కొట్టారు. కోట్ల విగ్రహంతో పాటు రావు బహద్దూర్ బిరుదాంకితుడు బుగ్గన శేషారెడ్డి, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను కూడా ఆవిష్కరించారు. తన తండ్రి విగ్రహాన్ని బుగ్గన ఆవిష్కరించడంపై కోట్ల ఎలా స్పందిస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…