AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Budget 2025: గత ప్రభుత్వం చేసిన అప్పులు.. రాష్ట్రంపై అణుబాంబు దాడితో సమానం: మంత్రి పయ్యావుల

2025-26 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి గత ప్రభుత్వాల ఆర్థిక అరాచకాలను తీవ్రంగా ఖండించారు. అమరావతి రాజధాని అభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి, డ్రిప్ ఇరిగేషన్ వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంక్ వంటి సంస్థల సహాయంతో రాజధాని నిర్మాణానికి నిధులు సమకూరుతున్నట్లు తెలిపారు.

AP Budget 2025: గత ప్రభుత్వం చేసిన అప్పులు.. రాష్ట్రంపై అణుబాంబు దాడితో సమానం: మంత్రి పయ్యావుల
Payyavula Keshav Ys Jagan
SN Pasha
|

Updated on: Feb 28, 2025 | 11:20 AM

Share

2025-26 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి పయ్యావుల కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను, నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టిన మంత్రి, వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చారు. మంత్రి మాట్లాడుతూ.. “తమ పిల్లల భవిష్యత్ కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో.. ఇప్పుడూ అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అప్పులు చేయడమే తప్ప.. అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సరి చేస్తున్నాం. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరపకపోవడంతో అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ముందుకు రాలేదు.” అని అన్నారు.

చంద్రబాబు ఇవాళ ఆలోచించేదే.. రేపు దేశం ఆలోచిస్తుంది..

అలాగే ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తెచ్చినప్పటి పరిస్థితులను బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల గుర్తు చేసుకున్నారు. డ్రిప్ ఇరిగేషనుపై అధ్యయనానికి ఇజ్రాయెల్ వెళ్లిన బృందంలో తానూ సభ్యుడిగా ఉన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబుకు గుర్తు చేశారు. “దేశంలో తొలిసారిగా ఉమ్మడి ఏపీలోనే డ్రిప్ ఇరిగేషన్ పైలెట్ ప్రాజక్టును అమలు చేశాం. జాతీయ స్థాయిలో డ్రిప్ ఇరిగేషనుపై వేసిన టాస్క్ ఫోర్సుకు చంద్రబాబే ఛైర్మనుగా ఉన్నారు. చంద్రబాబు ఇవాళ ఏం ఆలోచిస్తారో.. రేపు దేశం అదే ఆలోచిస్తుందనడానికి డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టే నిదర్శనం. ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ లేని రాష్ట్రం లేదు, డ్రిప్ ఇరిగేషన్ లేని పొలం లేదు. ఇలాంటి కీలకమైన డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.” అని వెల్లడించారు.

పవన్‌ కళ్యాణ్‌ మార్గదర్శకత్వంలో..

ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ గురించి కూడా ప్రస్తావించారు. మంత్రి మాట్లాడుతూ.. “డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మార్గదర్శకత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తున్నాం. నాటి ప్రభుత్వ అరాచక విధానాలపై అమరావతి రైతులు పోరుబాటను ఎంచుకున్నారు. తమను తాము కాపాడుకుంటూ రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని మరువలేం. రాజధాని పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజనులా రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. రాజధాని అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అని నిరూపితమైంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌, హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతికి నిధులు సమకూరాయి.” అని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.