AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SC నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇజ్రాయెల్‌లో లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ నిరుద్యోగ యువతకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఇజ్రాయిల్‌లో హోమ్ బేస్డ్ కేర్ గివర్ ఉద్యోగాలకు శిక్షణతో పాటు నెలకు రూ. 2 లక్షల జీతంతో ఉపాధి కల్పించనుంది. జీడీఏ, ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన 25-45 సంవత్సరాల వయసున్న యువత దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఉచితంగా శిక్షణ, వసతి అందిస్తుంది.

SC నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..  ఇజ్రాయెల్‌లో లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాలు
Andhra Government
Ram Naramaneni
|

Updated on: Aug 22, 2026 | 2:07 PM

Share

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించే దిశగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేవలం రాష్ట్రంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇజ్రాయిల్‌లో హోమ్ బేస్డ్ కేర్ గివర్ ఉద్యోగాలను కల్పించడం ద్వారా ఎస్సీ యువత నెలకు లక్షల రూపాయల వేతనాన్ని పొందే అవకాశాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం కేవలం డిగ్రీలు, పట్టాలు ఉంటేనే ఉద్యోగాలు లభించే అవకాశం చాలా తక్కువ. నైపుణ్యాలు కలిగిన వారికే మంచి ఉద్యోగాలు లభిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించారు.

అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ:

ఈ కార్యక్రమానికి జీడీఏ , ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు. దరఖాస్తుదారుల వయసు 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,500 మందిని ఇజ్రాయిల్‌లో హోమ్ కేర్ గివర్స్ ఉద్యోగాల కోసం రిక్రూట్ చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ సిద్ధంగా ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు www.apsccorporation.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. శిక్షణ, బోర్డింగ్, లాడ్జింగ్ సహా అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఇది పూర్తిగా ఉచిత కార్యక్రమం.

శిక్షణ వివరాలు:

ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల పాటు ఇంటర్మీడియట్ స్థాయి స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత, వారిని స్క్రూటినైజ్ చేసి ఇజ్రాయిల్‌కు పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం దీనికి నిర్దిష్టమైన చివరి తేదీ అంటూ ఏమీ లేదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ అని, ఒక బ్యాచ్ పూర్తయిన తర్వాత మరొక బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వబడుతుందని వెంకటేశ్వరరావు వివరించారు. శిక్షణ కేంద్రాలు ప్రస్తుతం శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి. విజయనగరం, పార్వతీపురం జిల్లాల అభ్యర్థులు శ్రీకాకుళం లేదా విశాఖపట్నం కేంద్రాలను ఉపయోగించుకోవచ్చు.

ఇతర నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు:

ఇజ్రాయిల్ ఉద్యోగాలతో పాటు, ఎస్సీ యువత కోసం ఇతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కూడా ఎస్సీ కార్పొరేషన్ అమలు చేస్తోంది. పదో తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్మీడియట్ పాస్ లేదా ఫెయిల్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు మూడు నెలల ప్రాక్టికల్ శిక్షణతో కూడిన నేషనల్ లెవెల్ గుర్తింపు పొందిన సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్లేస్‌మెంట్ అవకాశాలను కూడా కల్పిస్తారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (AP MSME), ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP), ప్రధానమంత్రి ముద్రా యోజన, కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు, కోయిర్ బోర్డు, నమో డ్రోన్ దీదీ వంటి కేంద్ర ప్రభుత్వం మద్దతుగల వివిధ పథకాల ద్వారా కూడా ఎస్సీ యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించడానికి కృషి చేస్తున్నారు.

సహాయం, సంప్రదింపులు:

దరఖాస్తు ప్రక్రియ లేదా శిక్షణకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు 8008892182 లేదా 9652600967 నంబర్లలో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించి, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతం చేసి, యువత తమ కాళ్లపై నిలబడాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.

Follow Us