Water Dispute: తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులివ్వొద్దు.. గోదావరినది యాజమాన్య బోర్డుకు ఏపీ సర్కార్ లేఖ.. వివరాలు
గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న అనధికార ప్రాజెక్టులకు అనుమతుల్ని ఇవ్వొద్దని గోదావరినది యాజమాన్య బోర్డుకు ఏపీ సర్కార్ లేఖ రాసింది.
Andhra -Telangana Water Dispute: గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న అనధికార ప్రాజెక్టులకు అనుమతుల్ని ఇవ్వొద్దని గోదావరినది యాజమాన్య బోర్డుకు ఏపీ సర్కార్ లేఖ రాసింది. సీతారామ ఎత్తిపోతల పథకం, తుపాకుల గూడెం ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు ముక్తేశ్వరం, చౌటపల్లి, మోడికుంటవాగు ప్రాజెక్టులకు అనుమతులను ఇవ్వొద్దని ఏపీ సర్కారు కోరింది.
గోదావరి నదిపై నిర్మిస్తున్న ఐదు అనధికార ప్రాజెక్టుల డీపీఆర్ లను తెలంగాణ సమర్పించిందని వాటికి అనుమతులను ఇవ్వొద్దంటూ కోరిన ఏపీ జలవనరుల శాఖ.. ఎలాంటి కేటాయింపులూ లేకుండా తెలంగాణ కేటాయింపులకు అదనంగా మరో 450 టీఎంసీల గోదావరి జలాలను వాడుకుంటోందని గోదావరినది యాజమాన్య బోర్డుకు రాసిన లేఖలో ఫిర్యాదు చేసింది.
కొత్త ట్రైబ్యునల్ అవార్డు వచ్చేంత వరకూ తెలంగాణ అనధికార ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దని జిఆర్ఎంబికి కోరిన ఏపీ.. భౌగోళికంగా తనకు ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ తెలంగాణా ఏడాది పొడవునా గోదావరి నదీ నీటిని కేటాయింపులతో నిమిత్తం లేకుండా వాడుకుంటోందని ఆరోపించింది.
గోదావరి నదిలో నీటి లభ్యతకు సంబంధించిన స్పష్టత తో పాటు ఏపీ, తెలంగాణాలకు సంబధించిన నీటి వాటాలను కొత్త ట్రైబ్యునల్ ఖరారు చేసేంత వరకూ తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్ లను ఆమోదించవద్దని పేర్కొంటూ ఏపీ సదరు లేఖలో కోరింది.