అమరావతి, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సర్కార్ అనుమతిచ్చింది.ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు విజయవాడలోని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పలు ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయాలని ఏపీపీఎస్సీకి సూచించింది. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీకి అనుమతిస్తూ పోస్టుల వివరాలతో జీవోలు జారీ చేసింది ప్రభుత్వం.
పర్యావరణ పరిరక్షణకు సంబంధించి వచ్చిన చట్టాలు సరిగా అమలవుతున్నాయా లేదా అని పర్యవేక్షించడానికి అధికారుల కొరత ఎక్కువగా ఉండటం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి అవసరమైన అధికారులు కొరత ఉండటంతో పోస్టుల భర్తీకి అనుమతిచ్చినట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. మరోవైపు అత్యవసర సర్వీసుల కేటగిరీ కిందకు వస్తున్న విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీలో పోస్టుల భర్తీకి అనుమతిచ్చినట్లు జీవోలో స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ల పోస్టులు 21, గ్రేడ్ -2 ఎనలిస్ట్‌ల పోస్టులు 18 భర్తీకి ఏపీపీఎస్సీకి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. దీనికి సంబంధించి జీవో ఎంఎస్-96ను విడుదల చేసింది.అటు వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీలో 19 జూనియర్ అసిస్టెంట్లు,ఒక అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అనుమతి ఇస్తూ జీవో ఎంఎస్ – 95 ను విడుదల చేసారు.ఈ రెండు జీవోలను ఆర్థిక శాఖ జారీ చేసింది. త్వరలోనే వీటికి సంబంధించిన పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేయనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.