Andhra: ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్.. ఎన్ని రోజులంటే.?
ఏపీ విద్యార్ధులకు పండుగ ముందే వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా భారీగా సెలవులు ఇచ్చింది. అయితే సెలవులు అయిన తర్వాతి రోజు నుంచి తిరిగి స్కూల్స్ రీ-స్టార్ట్ కానున్నట్టు తెలిపింది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

పండుగ వేళ కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపేందుకు ఏపీ విద్యాశాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి సెలవులను అధికారికంగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులకు జనవరి 10 నుంచి జనవరి 18 వరకు మొత్తం 9 రోజుల పాటు సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది. దీంతో చిన్నారుల నుంచి హైస్కూల్ విద్యార్థుల వరకు అందరికీ పండుగ ఆనందం ముందుగానే మొదలైంది. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు గ్రామాలకు వెళ్లడం, బంధువుల ఇళ్లలో పండుగ వేడుకల్లో పాల్గొనడం లాంటివి సులభంగా ఉండేలా ఈ సెలవులను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఏటా ఉండే విధంగానే ఈసారి కూడా పండుగ ముందు రోజునే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే సెలవులు ముగిసిన వెంటనే జనవరి 19 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
సెలవుల అనంతరం సిలబస్ ప్రకారం తరగతులు యథావిధిగా కొనసాగుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షలు, అకడమిక్ క్యాలెండర్‌లో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. సంక్రాంతి సెలవులు ఖరారవడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గ్రామాలకు వెళ్లి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకునే అవకాశం దక్కిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పాఠశాలల యాజమాన్యాలు కూడా సెలవుల షెడ్యూల్‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
