SDRF Constable died : ఏపీలో కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల విషాద ఘటనలు నెలకొంటున్నాయి. వరదల్లో సహాయక చర్యల కోసం కోసం వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. భారీ వర్షాలకు వరదలు సంభవించడంతో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలోని దామరమడుగు వాగు వద్ద నీటిలో ఇరుక్కున్న తండ్రీకొడుకులను రక్షించిన శ్రీనివాసరావు అనే ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్.. ఆ తర్వాత ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతై మృతి చెందాడు. వరదలో చిక్కుకున్న తండ్రీకొడుకులను కాపాడిన శ్రీనివాసరావు.. అనంతరం నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు.
రెస్క్యూ చేస్తున్న క్రమంలో లైఫ్ జాకెట్ జారిపోవడంతో వరద ఉద్ధృతికి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. తమ ప్రాణాలను కాపాడిన ఆ కానిస్టేబుల్ తన ప్రాణాన్ని కోల్పోవడం ఆ తండ్రీకొడుకులను కలచివేసింది. వారు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం కానిస్టేబుల్ మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. కాగా.. ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు భౌతికకాయానికి జిల్లా ఎస్పీ విజయరావు ఘననివాళి అర్పించారు. విధుల్లో బాధ్యతతో శ్రీనివాసరావు పనిచేస్తారని తెలిపారు.
కాగా.. నెల్లూరు గత రాత్రి నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికారులు అలెర్ట్ జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Also Read: