ఐదేళ్లపాటు పార్టీ కోసం శ్రమించారు.. టికెట్ తమదేనన్న ధీమాతో ఊరూవాడా తిరిగారు.. అయితే లాస్ట్‌మినిట్‌లో పరిస్థితి తారుమారయింది.. ఊహించని విధంగా సీటు గల్లంతయింది. దీంతో తమ రాజకీయ భవిష్యత్తుకు గ్యారెంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆ నేతలు. లక్షల మందిలో ఇచ్చిన టికెట్ హామీనే కుదరనప్పుడు..ఎమ్మెల్సీ హామీ ఎలా నమ్ముతామని నిలదీస్తున్నారు.
అరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దొన్నుదొరను స్వయంగా ప్రకటించారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఒక విధంగా అభ్యర్థుల ప్రకటనను అరకు నుండే చంద్రబాబు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు సివేరు అబ్రహం అసంతృప్తి వ్యక్తం చేసినా కూడా దొన్నుదొరవైపే మొగ్గు చూపారు చంద్రబాబు. అయితే పొత్తులో భాగంగా అరకు సీటు అనూహ్యంగా బీజేపీకి వెళ్లింది. దీంతో దొన్నుదొర పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన దొన్నుదొర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి జీవితాంతం కృషి చేశానని, కానీ అధిష్టానం తీవ్ర అన్యాయం చేసిందని వాపోయారు. లక్షల మందిలో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్‌కే గ్యారెంటీ లేనప్పుడు, ఎమ్మెల్సీ పదవి ఇస్తారంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
అటు రంపచోడవరం సీటును ఇప్పటికే మిరియాల శిరీషకు కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీంతో నియోజకవర్గంలో ఆమె ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకమయింది. కానీ ఇప్పటికీ టికెట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రాజేశ్వరి. టికెట్‌పై పునరాలోచన చేస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చినట్టు చెబుతున్నారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యేకి లైన్ క్లియర్ అవ్వడంతో రంపచోడవరం టికెట్‌పై కూడా మార్పు ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు రాజేశ్వరి.
ఇక విజయవాడ వెస్ట్ సీటు తనదేనని అధినేత భరోసా ఇవ్వడంతో ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నారు. జనసేన నేత పోతిన మహేష్. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేశారు. అయితే ఊహించని విధంగా పొత్తులో ఈ సీటు బీజేపీ వెళ్లిపోయింది. టికెట్ కోసం ఎంత పోరాడినా, ఎంత ఏడ్చినా న్యాయం జరగడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోతిన మహేష్. పోరాడి పోరాడి అలసిపోయానని, తనకు ఇంకా ఎన్నాళ్లీ పరీక్ష అంటూ అనుచరుల ముందు బోరుమంటున్నారు. తాజాగా మరోసారి అనుచరులతో సమావేశమైన పోతిన మహేష్..భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. మరోవైపు పార్టీ కోసం అలుపెరగకుండా పోరాడిన మహేష్ రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన అభిమానులు. మరి ఈ నేతల రాజకీయ భవిష్యత్తుకు అధినేతలు ఎలాంటి భరోసా ఇస్తారో చూడాలి..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…