AP Weather Report: ఐఎండి అంచనాల ప్రకారం శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, నాతవరం కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇంకా ఆయన తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం 10 మండలాల్లో వడగాల్పులు వీచాయి. అదేవిధంగా విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో స్వల్పంగా ఎండ తీవ్రత తగ్గనుంది.
అలాగే రేపు అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఎల్లుండి గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలంలో పని చేసే రైతులు, కూలీలు, పశు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. పొరపాటున కూడా చెట్ల క్రింద ఉండవద్దని ఐఎండీ ఎండీ అంబేద్కర్ హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..