ఉమ్మడి చిత్తూరు జిల్లా పై మిచౌంగ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. ఈదురుగాలతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. తిరుపతి జిల్లాలో అత్యధికంగా బి.ఎన్ కండ్రిగ మండలంలో 156.8 మి.మీ, వరదయ్యపాలెం మండలంలో 129.2 మి.మీ, శ్రీకాళహస్తిలో 124.0 మి.మీ, తొట్టంబేడు లో 123.0 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది. అత్యల్పంగా పాకాలలో 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో మొత్తం నిన్న ఒక్కరోజే 1831.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఇక చిత్తూరు జిల్లా అంతటా జడివాన కురుస్తోంది. వర్షం ప్రభావంతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా చిత్తూరు జిల్లాలో సగటున 14.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అత్యధికంగా నగిరిలో 94.2. మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. 20.1 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. యాదమరి, కార్వేటినగరం, పులిచర్ల, పలమనేరు, బైరెడ్డిపల్లి, వీకోట మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
పెనుమూరు మండలం కల్వకుంట ఎన్టీఆర్ జలాశయం గేట్లు ఎత్తివేసిన ఇంజనీరింగ్ అధికార యంత్రాంగం ప్రాజెక్టు నుంచి 150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసింది. నీవానది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. మల్లెమడుగు జలాశయంలో పెరిగిన నీటి ఉదృతితో రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసింది అధికార యంత్రాంగం. రేణిగుంట మండలం జింకలమిట్ట గ్రామంలోని పలు కాలనీలు నీట మునగగా ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది.
భారీ వర్షానికి పూరి గుడిసె గోడకూలి చిందేపల్లి గ్రామానికి చెందిన 4 ఏళ్ల యశ్వంత్ ప్రమాదంలో మృతి చెందాడు. 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి పూర్తిగా తడిసి ముద్దైన పూరిగుడిసె గోడ కుప్పకూలడంతో తీవ్రంగా గాయపడ్డ యశ్వంత్ ను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తల్లిదండ్రులు తరలించగా మార్గమధ్యంలోనే యశ్వంత్ మృతి చెందాడు. నారాయణవనం మండలం కైలాసకోన జలపాతంలో నీటి ఉధృతి పెరగడంతో జలపాతం నీటితోపాటు బండరాళ్లు పడుతుండడం వల్ల పర్యాటకులకు అనుమతిని పాలకమండలి నిలిపివేసింది.
మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అరణియార్, మల్లెమడుగు, కాళంగి, కృష్ణాపురం ప్రాజెక్ట్ లకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. ఇక తిరుపతి విమానాశ్రయంపై కూడా తుఫాన్ ఎఫెక్ట్ స్పష్టంగా కలిపిస్తొంది. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ నుంచి తిరుపతికి వచ్చి విశాఖ వెళ్లాల్సిన ఇండిగో విమాన సర్వీసు రద్దు అయ్యింది. విశాఖ నుంచి తిరుపతి మీదుగా విజయవాడ వెళ్లాల్సిన ఇండిగో విమానం కూడా రద్దు అయ్యింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి రావలసిన స్పైస్, ఇండిగో విమానాల ల్యాండింగ్ కు వాతావరణం సహకరించలేదు. హైదరాబాదు నుంచి తిరుపతి రావాల్సిన ఇండిగో విమానం గాలిలోనే అరగంటకు పైగా చక్కర్లు కొట్టింది. ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్ కావాల్సిన ఇండిగో విమానానికి
విసుజుబిలిటీ ప్రాబ్లం లేకపోయినా విండ్ ప్రభావంతో ల్యాండింగ్ కు ఇబ్బంది ఏర్పడింది.
తుఫాను ముప్పు పలు విమాన సర్వీసులను రద్దుకు కారణం అయ్యింది. ఇండిగో, స్పైస్ జెట్ ఎయిర్వేస్ సంస్థలు ఈ మేరకు విమాన సర్వీసులు రద్దు చేశాయి. హైదరాబాదు నుంచి తిరుపతి రావలసిన ఇండిగో విమానం 6E 7534 తిరుపతి విమానాశ్రయంలో ల్యాండ్ కాకపోవడం తో తిరిగి హైద్రాబాద్ కు మళ్లించింది. హైద్రాబాద్ నుంచి తిరుపతికి రావలసిన స్పైస్ జెట్ 6E 7738 బెంగుళూరు విమాాశ్రయానికి మళ్లించారు ఏవియేషన్ అధికారులు.తిరుపతి నుంచి హైదరాబాదు వెళ్ళవలసిన ఇండిగో విమానం 6E 7534 రద్దు చేయగా తిరుపతి నుంచి వయా విజయవాడ మీదుగా విశాఖ వెళ్ళవలసిన ఇండిగో విమానం 6E 7064 రద్దు అయ్యింది. విశాఖ నుంచి తిరుపతి కి రావలసిన ఇండిగో విమానం 6E 7063 రద్దు చేసింది ఇండిగో సంస్థ. మొత్తం 4 ఇండిగో విమాన సర్వీసులు, ఒక స్పైస్ జెట్ విమానాన్ని రద్దు కావడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు ప్రయాణికులు.
మరోవైపు తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. నిన్న ఉదయం 8 గంటల నుండి ఈరోజు ఉదయం 8 గంటల వరకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. గోగర్భం, పాపవినాశనం డ్యాములకు భారీగా వరదనీరు చేరుతోంది. పాపవినాశనం డ్యాం 693.6 మీటర్లు, గోగర్భం డ్యాంలో 22.87 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. కేవీబీ పురం మండలంలోని కాళంగి రిజర్వాయర్ కు నీటి ఉదృతి పెరిగింది. 5 గేట్ లను ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. కాళంగి ఆధరం రోడ్డులో ఉదృతంగా వరద నీరు ప్రవహిస్తుండటంతో 10 గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి.
శ్రీకాళహస్తి నియోజక వర్గంలోని పనసకోన కు నీటి ఉదృతి పెరిగింది. సమీప గ్రామాలు కొత్త కండ్రిగ, రాజీవ్ నగర్ కాలనీల్లోకి వరద నీరు చేరింది. పలు కాలనీలు జలమయం అయ్యాయి. వరదయ్యపాళ్యం మండలంలోని గోవర్ధనపురం వద్ద పాముల కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది. శ్రీకాళహస్తి-చెన్నై మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. కాటూరు వద్ద కలుజు పొంగిపొర్లడంతో కాటూరు-తడ, సత్యవేడు మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. రహదారులను పూర్తిగా మూసివేసి వాహన రాకపోకలను నియంత్రించారు పోలీసు అధికారులు. వరదయ్యపాళ్యం చుట్టు పక్కల గ్రామాలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికార యంత్రాంగం ఖాళీ చేయిస్తోంది. తుపాను పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..