ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ ఇవాళ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా మూడో విడత సాయాన్ని శనివారం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో నిధులను జమచేయనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని వైఎస్ జగన్ జమ చేయనున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరుసగా మూడో ఏడాది నగదు జమ చేయనున్నారు. ఈ మొత్తం కలిపితే మూడు విడతల్లో రూ.19,178.17 కోట్లను సర్కారు పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసినట్లు కానుందని అధికారులు తెలిపారు.
‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా మూడో విడత సాయాన్ని విడుదల చేయనున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ 78.94 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు లేఖలు రాశారు. మూడున్నరేళ్లలోనే 98.5 శాతం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం తమదేనని తెలిపారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చెప్పింది చేసి చూపించే చేతల ప్రభుత్వమన్నారు. 2019 ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట ఉండే రుణాల మొత్తాన్ని నాలుగు దఫాల్లో నేరుగా వారి చేతికే అందిస్తానని ఇచ్చిన మాటను అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉదయం 10గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు దెందులూరు చేరుకుంటారు. 10.50 నుంచి 12.35 గంటల మధ్య దెందులూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొని వైఎస్సార్ ఆసరా ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
కాగా.. వైఎస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ ఉత్సవాలను జగన్ ప్రభుత్వం 10 రోజుల పాటు నిర్వహించనుంది. ఈ మేరకు ఇప్పటికే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్.. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 5 వరకు ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..