కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ రూ.5,156 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బందరు పోర్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ సోమవారం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పర్యటించనున్నారు.ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి బందరు సమీపంలో తపసిపూడి గ్రామానికి చేరుకుంటారు. అనంతరం పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ, పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో జడ్పీ సెంటర్‌లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానం చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
కాగా, బందరు పోర్టు కోసం అధికారులు భూసేకరణ పూర్తిచేశారు. అన్ని అనుమతులు సాధించి, న్యాయ పరమైన వివాదాలు పరిష్కరించడంతోపాటు ఏపీ ప్రభుత్వం టెండర్లు ఖరారుచేసింది. దీంతో చకచకా పనులు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధంచేసింది. పూర్తిగా ప్రభుత్వ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పోర్టు రాకతో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి రానున్న కాలంలో ఉపాధి సైతం లభించనుంది.
ఇదిలాఉంటే.. బందరు పోర్టు నిర్మాణానికి 2008లో తొలిసారిగా అప్పటి ఏపీ ఉమ్మడి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత టీడీపీ హయాంలో 2019లో చంద్రబాబు రెండోసారి శంకుస్థాపన చేశారు. తాజాగా సీఎం జగన్ చేతుల మీదుగా మూడోసారి శంకుస్థాపన జరగనుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..