Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ‘ఈ సారి గెలిస్తే మరో 30 సంవత్సరాలు మన పాలనే’.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

రానున్న ఎన్నికలలో కూడా అధికారమే లక్ష్యంగా వైసీపీ నేతలంతా కలిసి పనిచేయాలని, విబేధాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి అందరూ ఒక్కటి కావాలని వైయస్ జగన్ తన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం..

CM Jagan: ‘ఈ సారి గెలిస్తే మరో 30 సంవత్సరాలు మన పాలనే’.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Ap Cm Jagan Speaking In Vijayawada Meeting
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 04, 2023 | 7:48 PM

రానున్న ఎన్నికలలో కూడా అధికారమే లక్ష్యంగా వైసీపీ నేతలంతా కలిసి పనిచేయాలని, విబేధాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి అందరూ ఒక్కటి కావాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశామయ్యారు. ఈ క్రమంలోనే సమావేశానికి హాజరైన పాంత్రీయ సమన్వయకర్త అయోధ్యరామిరెడ్డి, కృష్ణా జిల్లా అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ తదితరులను పేరు పేరునా పలకరించిన జగన్, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశానిర్ధేశం చేశారు.

సీఎం జగన్ మాట్లాడుతూ ‘నియోజకవర్గాల వారీగా మన పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతున్నాం.  కార్యకర్తలను కలుసుకోవడం దీని వెనుకున్న ఉద్దేశం. అంతేకాకుండా మరో 14, 15 నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ప్రతీ నియోజకవర్గంలోని గడపగడపకూ వెళ్లడం ద్వారా మనం ప్రజల్లో మమేకం అవుతున్నాం. క్కడైనా ఎవరైనా అర్హులైన వారు మిగిలిపోతే వారికి కూడా మంచి జరగాలి. దేవుడి దయతో మంచి పనులన్నీ చేయగలిగామని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ వివరించాలి. వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. సచివాలయాల వారీగా కన్వీనర్లు, అలాగే ప్రతి 50 నుంచి 70 ఇళ్లకు గృహసారథులను పార్టీ నుంచి నియమింపచేస్తున్నాం. పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యులను చేసుకుంటూ ముందుకు వెళ్తాం. గృహసారథుల్లో ఒకరు కచ్చితంగా మహిళ అయి ఉండాలి. ప్రజలతో పార్టీ క్యాడర్‌ మమేకం కావాలి’ అని అన్నారు.

సీఎం జగన్ తన మాటలను కొనసాగిస్తూ.. ‘ ఏ ఒక్కరికైనా ఏ చిన్న సమస్య ఉన్నా, అర్హత ఉండి మిస్‌ అయిపోతే దాన్ని పరిష్కరించి మంచి చేయాలి. అర్హులెవ్వరూ కూడా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ఇంత ధ్యాస పెడుతున్నాం.  గతంలో ఎవ్వరూ, ఎప్పుడూ ఇంత ధ్యాస పెట్టలేదు. సంవత్సరంలో రెండుసార్లు అలాంటి వారికి అన్నీ మంజూరు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 88శాతం ఇళ్లకు మంచి చేశాం. ప్రతి అక్క, చెల్లెమ్మ పేర్లతో సహా చేసిన మంచిని పారదర్శకంగా చెప్పగలం. అందుకనే రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రాజకీయ మార్పు జరుగుతోంది. కుప్పంలాంటి చోట్ల మున్సిపాల్టీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇలా అన్నీ 80 శాతానికి పైగా క్లీన్‌ స్వీప్‌ చేయగలిగాం’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

విజయవాడ ఈస్ట్‌లో కూడా..

‘విజయవాడ ఈస్ట్‌లో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నచోట కూడా మనం అధికంగా వార్డులు గెలవగలిగాం. మార్పు అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీనికి నిదర్శనమే ఇటీవల జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు. ఏమైనా సమస్యలు ఉంటే మనంలో మనం సర్దుబాటు చేసుకుందాం. కచ్చితంగా 175 కి 175 సీట్లు గెలవాలి. అలాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. వార్డులోకి వెళ్లినా, గ్రామంలోకి వెళ్లినా..  ప్రతి ఇంట్లోకూడా సంతోషం కనిపిస్తోంది. మన ప్రాంతంలో స్కూళ్లు మారుతున్నాయి, చదువులు మారుతున్నాయి, ఆస్పత్రులు మారుతున్నాయి. ఆర్బీకేల ద్వారా వ్యవసాయం మారుతోంది. ఇంత మార్పు అన్నది ఎప్పుడూ కూడా జరగలేదు. వచ్చే ఉగాది నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కూడా పూర్తిస్థాయిలో వస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో మనం తీసుకొచ్చిన మార్పులు అన్నీ కూడా పూర్తిస్థాయిలో ఫలితాలు ఇస్తాయి. కాబట్టి రానున్న ఎన్నికలకు మనం అంతా కలిసి కట్టుగా పనిచేయాలి’ అని జగన్ తన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఎలాంటి విభేదాలున్నా పక్కనపెట్టాలి..

‘త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలి. ఈసారి గెలిస్తే.. మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం. 30 ఏళ్లపాటు మంచి పరిపాలన ప్రజలకు అందిస్తాం. నాకు ఎన్ని కష్టాలు ఉన్నాసరే.. బటన్‌ నొక్కే కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను. మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి. ఒకరికొకరు కలిసి ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలి. ప్రతి ఇంటికీ వెళ్లి.. వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. మనకు ఓటు వేయని వారి ఇళ్ళకు కూడా మనం వెళ్లాలి. చేసిన మంచిని వారికి వివరిస్తే.. కచ్చితంగా వారిలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. మనం వెళ్లకపోతే తప్పు చేసినట్టు అవుతుంది. అందుకనే ప్రతి ఇంటికీ వెళ్లాలి. అందరి ఆశీర్వాదాలు కావాలి. మంచితనంతో మన ప్రయత్నం మనం చేయాలి’ అంటూ సీఎం జగన్‌ విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..