రాజధాని భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడు పెంచింది. రాజధాని డిజైన్ రూపకల్పన, రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని నిర్మించి ఇన్నర్ రింగ్ అలైన్‌మెంట్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పి.నారాయణపై FIR దాఖలు చేసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు CID పోలీసు స్టేషన్‌లో నిన్న 16 బై 2022 కింద FIR నమోదు చేశారు. IPC సెక్షన్లు 120, 420 34, 35, 36, 37, 166, 167 217తో పాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13 కింద ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడిని A1గా మాజీ మంత్రి పి.నారాయణను A2గా చేర్చారు. చంద్రబాబు నాయుడికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌ను ఈ కేసులో A6గా చేర్చారు. లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్ సహ మొత్తం 14 మంది పేర్లను FIRలో చేర్చారు. ఇందులో ప్రభుత్వాధికారులు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారని FIRలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజదాని మాస్టర్ ప్లాన్ రూపకల్పన, ఇన్నర్ రింగ్ రోడ్, దానికి సంబంధించి అనుసంధాన మార్గాల అలైన్‌మెంట్ విషయంలో అక్రమాలు జరిగాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారని FIRలో పేర్కొన్నారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ప్రభుత్వంలో ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులు అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగిన వీళ్లు ఈ కారణంగా విపరీతంగా లబ్ది పొందారని ఫిర్యాదులో ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అంతే కాదు ఈ కారణంగా సాధారణ ప్రజానీకంతో పాటు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఇదంతా మోసం కిందకు వస్తుంది కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
ఏప్రిల్ 27న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు, ఈ నెల 6న ప్రాథమిక విచారణ నివేదిక తమకు ఈ నెల 9న అందిందని పోలీసులు పేర్కొన్నారు. వీటి ఆధారంగా IPCలో వివిధ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం కింద పోలీసులు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు FIR నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఒరిజినల్ FIRతో పాటు ఫిర్యాదు కాపీ, సంబంధిత పత్రాలను విజయవాడలోని ACB ప్రత్యేక కోర్టు 3వ అదనపు సెషన్స్ జడ్జి కోర్టులో సమర్పించారు. నిన్న సాయంత్రం 4 గంటలకు దీన్ని పంపించినట్టు CID అధికారులు తమ FIRలో పేర్కొన్నారు. మంగళగిరిలోని CID అదనపు DGP ఈ కేసు విచారణకు దర్యాప్తు అధికారిగా ఆర్థిక నేరాల విభాగం, అదనపు SP జయరామరాజును నియమించారు.