చిత్తూరు జిల్లా కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుప్పం – పలమనేరు జాతీయ రహదారిలోని శెట్టిపల్లి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. కుప్పం వైపు వెళ్తూ.. లారీని ఢీకొట్టడంతో కారు ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మెడికోలు, మరో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. మృతులు కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వికాస్, కళ్యాణ్, మరో మెడికో కల్యాణ్ రామ్ సోదరుడు ప్రవీణ్ గా గుర్తించారు. ప్రమాదానికి కారు మితిమీరిన వేగమే కారణంగా తెలుస్తోంది. పీఈఎస్ నుంచి కారులో కుప్పం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వీరంతా కడప, నెల్లూరుకు చెందిన వారుగా గుర్తించారు.
తమ స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా బర్తడే పార్టీ జరుపుకుని కారులో మితిమీరిన వేగంతో వెళ్తూ అదుపుతప్పి ముందు వైపు వెళ్తున్న లారీని ఢీకొన్నారు. వేగానికి ఎదురుగా వస్తున్న మరో లారీకి కారు అడ్డంగా పడడంతో షిఫ్ట్ కారు నుజ్జునుజ్జవగా కారులోని ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు.. స్పాట్ కు చేరుకున్నారు. తెల్లవారు జామున ఘటన జరగడంతో హైవేపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..